మేకిన్ ఇండియా వొట్టిదే అంతా మేడిన్ చైనానే. – రాహుల్ గాంధీ.

భోపాల్:
మరో ఆరు నెలల్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఏడాది పోలీస్ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన మాండ్సౌర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి కేంద్ర బిందువైంది. పోలీసు కాల్పుల్లో రైతులు మృతి చెంది ఏడాది ఐన సందర్భంగా మృతుల కుటుంబాలు, స్నేహితులు మాండ్సౌర్ లో పది రోజుల నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. మాండ్సౌర్ లో ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ మృతులకు నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటకు సరైన ధర కల్పించాలని..రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతులే కాదు…పారిశ్రామిక రంగం కూడా దివాళా తీసిందని అన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విఫలమైందని..ఇప్పుడు అంతా మేడిన్ చైనానే అని ఎద్దేవ చేశారు. ఇండియన్ మార్కెట్లన్నీ చైనా వస్తువులతో నిండిపోయాయన్నారు. ఓ వైపు మోదీ చైనా అధ్యక్షుడితో గుజరాత్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే..మరో వైపు డోక్లాంలో చైనా సైన్యం మోహరిస్తుందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మేకిన్ మాండ్సౌర్ చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామని అన్నారు.