హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దికిగాను బాండ్లరూపంలో నిధులను సేకరించినందుకు ప్రోత్సాహకరంగా రూ. 26 కోట్ల చెక్కును దేశ ప్రధాని నరేంద్ర మోడి హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్యదర్శి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డిలకు అందచేశారు. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో నేడు సాయంత్రం జరిగిన రెండురోజుల ట్రాన్స్ఫార్మింగ్ అర్భన్ ల్యాండ్ స్కేపింగ్ సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని మోడి అందజేశారు. బాండ్ల రూపంలో రూ. 200కోట్లను సేకరించినందుకుగాను అమృత్ పథకం కింద రూ. 26 కోట్ల ప్రోత్సాహక బహుమతిని అందజేస్తూ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని కూడా ప్రధాని ప్రధానం చేశారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, గృహనిర్మాణం, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరిదీప్సింగ్పురి, గవర్నర్ రాంలాల్ తదితరులు కూడా హాజరైన ఈ సమావేశంలో పురస్కారాన్ని ప్రధాన మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా సభకు హాజరైనవారు ఈ ప్రోత్సాహక బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కరతాళధ్వనులు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డిలకు ముందు వరసలో సీటు కేటాయించడం విశేషం. ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్రెడ్డిలు ప్రధానికి స్వచ్ఛ నమస్కారం అంటూ గౌరవించడంలోనూ తమ ప్రత్యేకత చూపించారు.
సింగం చెరువు తండ లబ్దిదారితో ప్రధాని భేటి:
ట్రాన్స్ఫార్మింగ్ అర్భన్ ల్యాండ్ స్కేపింగ్ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్రమోడి హైదరాబాద్ నగరంలోని సింగంచెరువు తండ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ లబ్దిదారి అయిన గిరిజన మహిళ కె.జ్యోతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోజువారి కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం తాము ఊహించని విధంగా డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిందని గిరిజన మహిళ జ్యోతి ప్రధానికి తెలిపింది. గతంలో గుడిసెలో ఉన్న తాము ఎండ, వానలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారమని, డబుల్ బెడ్రూం ఇళ్లతో తమ కుటుంబం సంతోషంగా ఉందని తెలిపారు.