మే లో గెలవలేని కేసీఆర్ డిసెంబర్ లో గెలుస్తారా!! -అమిత్ షా.

మహబూబ్ నగర్:

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని… అందుకే, తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించడం లేదని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని దేశం గర్వించేలా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. లోక్ సభతో పాటే అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే…ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని అన్నారు. మే నెలలో గెలవలేని కేసీఆర్… డిసెంబర్ నెలలో ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ బహిరంగసభలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ మేరకు విమర్శలు గుప్పించారు.తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అమిత్ షా మండిపడ్డారు. 201లో దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికైనా ఆ పని చేస్తారాఅని ప్రశ్నించారు. దళితులంతా కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో దళితులకు, ఆదివాసీలకు భరోసా ఇవ్వగలిగిన పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలలు కంటున్నారని… వరుసగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో ఆయన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అమిత్ షా అన్నారు. పీవీ నరసింహారవు, అంజయ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహబూబ్ నగర్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఢమరుకం మోగించి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ తన ప్రసంగాన్ని అమిత్ షా ప్రారంభించారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉన్నా… కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని చెప్పారు. ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు ఎన్నికల నిర్వహణ కోసం భారీ ఎత్తున ప్రజా సంపద ఖర్చు అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య లడాయి మొదలైందని అన్నారు.