మొబైల్ యాప్ తో గెలిచిన ఇమ్రాన్.

దేశ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే కీలక సాధారణ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ గెలిచింది. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ గెలుపు వెనక సైన్యం మద్దతు ఉందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించవచ్చు. కానీ పీటీఐ అధునాతన టెక్నాలజీని వాడుకోవడమే ఆ పార్టీ విజయానికి కారణమని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఎన్నికలకు ముందు పీటీఐ ఒక మొబైల్ ఫోన్ యాప్ తయారుచేసి దాదాపుగా 5 కోట్ల మిలియన్ల మంది ఓటర్ల డేటాబేస్ సిద్ధం చేసుకోవడమే కెప్టెన్ టీమ్ నెగ్గడానికి బాటలు వేసిందని అంటున్నారు.

ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఓ అధికారిక యాప్ తయారుచేసి అర్హులైన ఓటర్లను అందులో నమోదు కావాల్సిందిగా కోరింది. సుమారుగా 50 మిలియన్ల మంది ఆ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. ఎన్నికల రోజు ఎలక్షన్ కమిషన్ అందించే టెలిఫోన్ సర్వీస్ పని చేయకపోయినా పీటీఐ కార్యకర్తలు తమ యాప్ ద్వారా ఆ సేవలు అందజేశారు. తమ డేటాబేస్ లో పేర్లున్న వాళ్ల ఇల్లిల్లూ తిరిగి పీటీఐ అభిమానులు, మద్దతుదారులు వాళ్లను పోలింగ్ స్టేషన్లకు తరలించారు. దీంతో పీటీఐకి పడే ఓట్లు మిస్సయ్యే ఛాన్సే లేకుండా పోయింది.

2013 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ చేతిలో ఓడిపోయింది. దీంతో పీటీఐ పార్టీ పూర్తిస్థాయిలో వ్యూహాలు రచించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాన్ స్టిట్యుయెన్సీ మేనేజ్ మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) అనే డేటాబేస్ తయారు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇమ్రాన్ వాట్సాప్ ద్వారా సీఎంఎస్ లో పేరు నమోదు చేసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. సోషల్ మీడియాలో కెప్టెన్ కి ఉన్న పాపులారిటీని పీటీఐ ఈ డేటాబేస్ తో ఓట్లుగా మార్చుకొంది. ఈ సంగతి ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు బయటపడింది.