మోడల్ డాక్టర్.ఒడిశాలో సంచలనం.

భువనేశ్వర్:
ఇతనో డాక్టర్. పేరు కిషోర్ చంద్ర.కన్నీటి పర్యంతమై ప్రజలకు నమస్కారం పెడుతున్నాడు.అతనికి ఏదో ఇబ్బంది వచ్చిందనీ కాదు, అతనిపై ఎవరో దాడి చేసిందీ కాదు. ప్రజల అభిమానం భరించలేక ఆయన గంటల కొద్దీ ఏడుస్తూనే వున్నాడు. 32ఏళ్ళ ఈ డాక్టర్ ఒరిస్సాలోని తెంతుల్ కుంటి ఫిర్కాలో ప్రజలకు కనిపించే దేవుడు. వయసుకు చిన్నవాడే అయినా గత ఏడేళ్ళుగా 70వేల మందికి ఆధారమైన ఒకే ఒక ఆస్పత్రిని గుడిగా మార్చిన మహానుభావుడు. తన సర్వస్వం ప్రజల కోసం ధారపోశాడు. ఎక్కడ ఏం జరిగినా, ఏ గ్రామంలో ఎవరికి వ్యాధి సోకినా, రోగులు ఆస్పత్రికి రాలేకపోయినా తానొక్కడే రాత్రిపగలు తేడా లేకుండా వెళ్ళి రోగులకు చికిత్స చేసేవాడు. రేయింబవళ్ళు నిరంతరం రోగుల సేవలోనే గడిపిన ఈ డాక్టర్ మహనీయుడు. చిన్నవయసులో ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న డాక్టర్లు చాలా అరుదు. ప్రభుత్వ డాక్టర్లుగా వుంటూనే అందరికీ దైవ సమానుడయ్యాడు. అటువంటి డాక్టర్ కిషోర్ చంద్ర ఆర్ధోపెడిక్స్ లో పీజీ చేసేందుకు స్టడీ లీవ్ కింద భువనేశ్వర్ వెళుతున్నారు. డాక్టర్ కు వీడ్కోలు చెప్పేందుకు 10వేల మందికి పైగా ప్రజలు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. బస్సు స్టేషన్ వరకు మేళతాళాలతో పూలపాన్పుపై ఆయనను నడిపించారు. ఆ సమయంలో గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై వెళుతున్న ప్రయాణీకులు కూడా తమ వాహనాలను వదిలి ఆయన వెంట నడిచారు. ప్రజల అభిమానాన్ని తట్టుకోలేక కిషోర్ చంద్ర కన్నీటితో వారికి వీడ్కోలు చెప్పారు. ప్రజల గుండెల్లో ఇంత మంచి స్థానం సంపాదించుకున్న డాక్టర్ కిషోర్ చంద్ర నిజంగా అభినందనీయుడు. ప్రభుత్వ డాక్టర్లు తమ విధిని ఇలాగే నిర్వహిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒరిస్సా ప్రభుత్వ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ మెహర్దా మాట్లాడుతూ కిషోర్ చంద్రను చూసి తామంతా గర్వపడుతున్నామని, దేశంలో డాక్టర్లకే ఆయన రోల్ మోడల్ అని ప్రశంసించారు. ఒరిస్సా ప్రభుత్వం కూడా కిషోర్ చంద్రకు స్టడీ లీవ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న ఆస్పత్రిలోనే ఆయనకు పోస్టింగ్ ఇస్తామని ప్రకటించింది.