మోడీతో కేసీఆర్, జగన్, పవన్ కుమ్మక్కు!! – చంద్రబాబు స్పందన.

తిరుపతి:
నల్గొండ టీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తానెప్పుడు హుందాగానే ఉంటానని , హుందాతనం కోల్పోయి మాట్లాడటం పద్దతికాదని ఆయన సూచించారు. కేసీఆర్, జగన్, పవన్ కలిసి బీజేపీతో కుమ్మక్కయ్యారని, బయట నాటకాలాడుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా? బాబ్లీకోసం పోరాడటం తప్పా?, తెలుగు ప్రజల సంక్షేమం కోరుకోవడం తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో తెలుగు ప్రజలు ఆలోచించాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని చంద్రబాబు అన్నారు.
‘‘రెండు రాష్ట్రాలకు తగవు వద్దంటే అక్కడి సీఎం వినడంలేదు. హైదరాబాద్ వదిలి వెళ్లాలన్నప్పుడు అందరి కంటే ఎక్కువ బాధ పడ్డా. కానీ వాళ్లు నా తెలుగు వాళ్లే అనే ఒక్క కారణంతో వచ్చేశా. నన్ను గెలిపించిన ప్రజల కోసం మరో నగరం కట్టుకుంటే కేంద్రం అణచివేస్తోంది. పక్క రాష్ట్రం సహకరించాల్సింది పోయి బీజేపీ ఆదేశాలతో నాపైనే దాడి చేస్తోంది. నాకు పాలసీలు చేయడం తప్ప.. దిగజారి మాట్లాడటం రాదు. తొందరపడి నోరు జారడం.. తిరిగి వెనక్కు తీసుకోవడం నాకు రాదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడు పరుష పదజాలం వాడలేదు. మోదీని చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు’’ అని చంద్రబాబు తెలిపారు.