మోడీ అబద్ధాలకోరు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్;

న్యూఢిల్లీ:
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత శశిథరూర్ రాసిన ‘ద పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ ఆవిష్కరణ సభలో పాల్గొన్న మన్మోహన్, మోడీ ఒక అబద్ధాలకోరు ప్రధానమంత్రి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రధాని పరిపాలన దేశానికి మంచిది కాదని మన్మోహన్ హెచ్చరించారు. సంప్రదాయిక హింస, మూకోన్మాదం, గోరక్షణ దాడులు వంటి ఘటనలపై ప్రభుత్వం మౌనాన్ని ఆశ్రయించడాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ పాలనలో దేశంలోని విశ్వవిద్యాలయాలు, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. సీబీఐ చీఫ్‌ను, డిప్యూటీ డైరెక్టర్‌ను విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడాన్ని ఆయన నిలదీస్తూ, మొత్తం అంశంపై మోదీ మౌనం వహించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ఇంతవరకూ మోడీ ప్రభుత్వం ఏం చేయలేదని, విదేశాల నుంచి కోట్లాది రూపాయల నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న హామీలు గాలికొదిలేశారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ దేశాన్ని విపత్కర పరిస్థితిల్లోకి నెట్టేశాయన్నారు.