మోత్కుపల్లి కన్నీళ్ల వెనుక! వీరుడైతే విలాపం ఎందుకు?

ఆరు సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా, తెలుగుదేశం విధాన నిర్ణాయక సంఘం పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసిన, మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా తన కులం గురించి మాట్లాడడం,’దళితుడి’నైనందుకే తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వాపోవడం భారత రాజకీయాలకు పట్టిన ఒక రుగ్మత.మోత్కుపల్లి మంచి వక్త.ప్రత్యర్ధులను మాటలతో చెండాడంలో ఆరితేరిన నేత.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ పైన చాలా సార్లు నిప్పులు చెరిగారు.’నోరుపారేసుకున్నారు’. అప్పుడు కెసిఆర్ మంచితనం మోత్కుపల్లికి కానరాలేదు.


హైదరాబాద్;
తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి కన్నీళ్ల వెనుక కథ ఏమిటి?ఆయన చంద్రబాబుపై తిరుగుబాటు ఆకస్మిక పరిణామం కాదు.చాలా కాలంగా ఆయన హోంవర్కు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు వెనుక కొన్ని కారణాలున్నాయి.ఆయనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వారా బిజెపి నుంచి గవర్నర్ పదవి వస్తుందని ఇంతకాలం వేచి చూశారు.అయితే బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకున్నందున ఇక గవర్నర్ పదవి రాదని తేలిపోయింది.తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదని ఆయనకు ఇదివరకే తెలుసు.అందువల్ల తెలుగుదేశం తెలంగాణ యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు గతంలో ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనపై నిరసనలు వచ్చాయి.భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజా ఘటనల నేపథ్యంలో పార్టీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించారు.తెలంగాణ తెలుగుదేశం పార్టీని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.టిఆర్ఎస్ వైపు డ్రైవ్ చేయడానికి మోత్కుపల్లి ప్రయత్నించారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. కానీ మోత్కుపల్లి , ఎల్.రమణ వంటి కొందరు నాయకుల చర్యల వల్ల టిటిడిపి శ్రేణులు కాంగ్రెస్ లో చేరకుండా నిరోధించగలిగారు.చంద్రబాబు నాయుడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చేసిన తిరుగుబాటు, వెన్నుపోటు పొడవడానికి సంబంధించి మోత్కుపల్లి నర్సింహులు చేస్తున్న ఆరోపణలు,’ఫోటో ఎగ్జిబిషన్’ పెద్దగా ఫలితమివ్వక పోవచ్చును.ఎన్టీఆర్ ఫై చంద్రబాబు తిరుబాటు చేసిన సమయంలో మోత్కుపల్లి ఎన్టీఆర్,లక్ష్మీపార్వతి వెంట ఉండిన నాయకులలో ఒకరు.తర్వాత ఆయన కూడా చంద్రబాబు శిబిరానికి వెళ్ళడం ఆయన అవకాశవాదాన్ని బహిర్గతం చేస్తున్నది.ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.మరోసారి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు.తెలంగాణలోని సీనియర్ శాసన సభ్యుల జాబితాలో ఆయన ఉంటారు.తెలంగాణ రాష్ట్ర సమితి అవతరణ తర్వాత రాజకీయ భవిష్యత్తు తారుమారైన నాయకులలో మోత్కుపల్లి ఒకరు. ఆరు సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా, తెలుగుదేశం విధాన నిర్ణాయక సంఘం పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేసిన, మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా తన కులం గురించి మాట్లాడడం,’దళితుడి’నైనందుకే తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వాపోవడం భారత రాజకీయాలకు పట్టిన ఒక రుగ్మత.మోత్కుపల్లి మంచి వక్త.ప్రత్యర్ధులను మాటలతో చెండాడంలో ఆరితేరిన నేత.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ పైన చాలా సార్లు నిప్పులు చెరిగారు.’నోరుపారేసుకున్నారు’. అప్పుడు కెసిఆర్ మంచితనం మోత్కుపల్లికి కానరాలేదు.కానీ రాజ్యసభ సీటు ఇవ్వలేదనో,గవర్నర్ పదవి రాలేదనో అలగడం,ఆగ్రహించడం, దళిత కార్డును వాడడం విమర్శలకు దారితీస్తున్నది. కెసిఆర్ ‘స్కెచ్’ప్రకారమే నరసింహులు తాజా కధకు పూనుకున్నారా?లేక స్వయంగా ఆయనే కెసిఆర్ వ్యవహారశైలికి ముగ్ధుడై అధికారపక్షంలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారా ?తెలియదు.అయితే కెసిఆర్ మోత్కుపల్లి వంటి వంటి చాలా మంది నాయకులను చూశారు.చూస్తున్నారు.’ఫైర్ బ్రాండ్’ గా ముద్ర వేసుకున్న మోత్కుపల్లి ని కెసిఆర్ చేరదీస్తారా?? అనే అనుమానాలు ఉన్నాయి.