యుపి బీజేపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం.

లక్నో:
ఉత్తరప్రదేశ్ మీరట్ పట్టణంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ పై హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది. అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు సంగీత్ సోమ్ ఇంటిపై హ్యాండ్ గ్రనేడ్ విసరడంతో పాటు బుల్లెట్ల వర్షం కురిపించారు. ముందుగా సెక్యూరిటీ పోస్ట్, మెయిన్ గేట్ పై తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే గ్రనేడ్లు విసిరి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వచ్చిన పోలీసులు ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ స్పాట్ లో లభించిన ఖాళీ బుల్లెట్లు, గ్రనేడ్ అవశేషాలను సేకరించింది. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే సంగీత్ సోమ్ చెప్పారు. ఆ సమయంలో తనను గ్రనేడ్‌ విసిరి చంపుతామని బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత ఇటీవల తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు.