యువ క్రికెటర్ పృథ్వీ షా పై ప్రశంసల జడివాన.

న్యూఢిల్లీ:
తొలి టెస్టులోనే సెంచరీ చేసిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షాను దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రాజ్‌కోట్ లో ఆరంభమైన మొదటి టెస్టులో పృథ్వీ షా స్వేచ్ఛగా ఆడుతూ 154 బంతుల్లో 19 ఫోర్లతో 134 పరుగులు చేయడమే కాకుండా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ యువ ఓపెనర్‌ని అభినందిస్తూ భారత మాజీ క్రికెటర్లు ట్వీట్స్ చేశారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ చూసి మురిసిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే దూకుడుగా ఆడటం ఆకట్టుకుందని చెప్పాడు లిటిల్ మాస్టర్. ఇలాగే నిర్భయంగా ఆడమని సూచించాడు. షా తరహాలోనే దంచికొట్టే వీరేందర్ సెహ్వాగ్ అయితే ఇది ఆరంభం మాత్రమేనని.. ఈ కుర్రాడిలో ఎంతో దమ్ముందని ప్రశంసించాడు. వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కూడా షా బ్యాటింగ్ విన్యాసాలను తెగ పొగిడాడు. డెబ్యూలోనే సెంచరీ చేయడం అద్భుతమని ట్వీట్ చేశాడు. 18 ఏళ్ల పిల్లాడు తన సహజసిద్ధమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడని..ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే షా..వాటె షో అని ట్వీటాడు. మాజీ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ మహమ్మద్ కైఫ్ షాని పెద్ద రేసుల గుర్రం అని చెప్పాడు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ కూడా షా ఆటపై ఆనందం వ్యక్తం చేశారు.