యువ జర్నలిస్టులకు త్వరలో శిక్షణా తరగతులు.

హైదరాబాద్:
మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశం సోమవారం అసెంబ్లీలోని కమిటీ హల్ 4 లో జరిగింది. సమావేశంలో చైర్మన్ తో సహా మొత్తం 11 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమకమైన ఎంఏ. మాజిద్, జూన్ 2 సందర్బంగా ఉత్తమ జర్నలిస్టులుగా ప్రభుత్వ పురస్కారం అందుకొన్న వై. నాగేశ్వర్, సూరజ్ వి. భరద్వాజ్ లను అభినందిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్య సమావేశాన్ని ప్రారంభించారు.
స్పీకర్ మధుసూదనా చారి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు అనుమతితో ఆగస్టు 11, 12 తేదీల్లో, 2 రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ కు వెళ్లాలని నిర్ణయించారు. మంత్రి హరీష్ రావు సూచన మేరకు జర్నలిస్టులకు ఓరియెంటేషన్ క్లాసులను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో సమావేశాలు, కార్యకలాపాల తీరు తెన్నులపై అధ్యయనం చేసేందుకు, మీడియా కమిటీ సభ్యుల టూర్ నిర్వహించాలని నిర్ణయించారు.
కమిటీ నిర్ణయాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని అసెంబ్లీ సెక్రటరీ హామీ ఇచ్చారు. సమావేశానికి సూరజ్ వి. భరద్వాజ్, ఎంఏ మాజిద్, వై. నాగేశ్వర రావు, మెండు శ్రీనివాస్, సోమగోపాల్, కేవీ రావు, మార్గం శ్రీనివాస్, మల్లేశం, వెలిజాల చంద్రశేఖర్, ఎక్కల్దేవి శ్రీనివాస్, కిరణ్, రాహుల్ లు హాజరయ్యారు. అటు అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డితో పాటు, ప్రోటోకాల్ విభాగం ఇతర సిబ్బంది, శాసనసభ రిపోర్టర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.