యూనివర్సిటీలపై కేసిఆర్ నిర్లక్ష్యం. – కోదండరామ్.

హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస మౌళిక సదుపాయాలు కల్పించకుండా యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని దుయ్యబట్టారు. యూనివర్సిటీల సవరణకు సంబంధించిన చట్టాలు అవి ఏర్పడినప్పుడే చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతీ యూనివర్సిటీ అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పడుతుంది.ఆ చట్టాలు యూనివర్సిటీల ఏర్పాటుతో వచ్చినవి అని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పుల రీత్యా చట్టాలను సవరించాలనేది ప్రభుత్వానికి ఉన్న అభిమతమని.. దాని కోసం త్వరలో నిపుణుల కమిటీ వేస్తామని, ఆ నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటామ ని ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రంలో ఒక్కొక్క యూనివర్సిటీకి 200 కంటే ఎక్కువగా అఫిలియేటెడ్ కాలేజీలు ఉండకూడదు. కానీ కొన్నింటి సంఖ్య పెరిగిందన్నారు. మరికొన్ని యూనివర్సిటీలను ఉంచాలా లేక వాటిని వేరే యూనివర్సిటీల్లో కలపాలా అన్న ఆలోచన కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీల్లో మౌళిక సదుపాయాలకు సంబందించిన అంశాలు ప్రస్తావించినట్లు ఎక్కడా కూడా కనిపించడం లేదన్నారు.దాదాపుగా 50 శాతానికి పైగా పోస్టులు యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉస్మానియా, కాకతీయ, మిగతా అన్ని యూనివర్సిటీల్లో దాదాపుగా పరిస్థితి ఇంతే ఉందని అన్నారు. దాదాపుగా పైస్థాయి ఉద్యోగాలు చాలా వరకూ ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీల్లో ఫ్రొఫెసర్ కావాలంటే 10 నుండి 15 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. చాలా సంవత్సరాల్లో ప్రొఫెసర్ల నియామకాలు లేకపోవడంతో డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం ఈ ఖాళీలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా చేయలేదని పేర్కొన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా యూనివర్సి టీలను నడిపించడం సాధ్యం కాదు. ఉద్యోగుల జీతభత్యాలకే చాలని నిధులు ఏ చట్టాలు సవరించినా ఖాళీలు పూరించకుంటే యూనివర్సిటీలు నిలదొక్కుకోవని, ప్రతీ యూనివర్సిటీలో నిధుల కొరత ఉందని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న నిధులు జీతభత్యాలకు కూడా చాలడం లేదని వెల్లడించారు. సరైన నిధులు లేకపోవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి కుంటు పడిపోయింది. కొత్త పోస్టులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో విద్యాపరమైన సంస్కరణలకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిధుల కేటాయింపుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయాలపై దృష్టి సారించకపోతే యూనివర్సిటీల మనుగడ కష్టం అవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఆమోదించిందన్నారు.ఇదే కనుక జరిగితే విద్య అనేది కేవలం డబ్బులు ఉన్న వాళ్లకు మాత్రమే అందుతుందని వాళ్లు మాత్రమే చదువుకోగలుగుతారని చెప్పారు. అలాంటప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు కొన్ని కోర్సులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయని వివరించారు. ఒకప్పడు హైదరాబాద్ డిగ్రీ విద్యలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు విద్యావ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో డిగ్రీ వ్యవస్థ కూలిపోయిందన్నారు. దీంతో విద్యార్థులు పూనే, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లి చదువుకోవలసిన దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఈ డిగ్రీ వ్యవస్థను పునరుద్దరించే విషయమై ఇప్పటివరకూ ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా జరుగలేద న్నారు. మౌళికమైన సమస్యలను పక్కనపెట్టి చట్ట సవరణ అంశం ఎందుకు జరుగుతందో అనే విషయం అర్థం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనివర్సిటీలలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.