యోగి ఆదిత్యనాథ్ కు సీఐ పూజ.

లక్నో:
ఉత్తరప్రదేశ్‌లో ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కి యూనిఫాంలో మోకరిల్లడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తోంది. సదరు అధికారి తన భక్తిప్రపత్తుల తాలూకు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో ఆయనకు ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ మొదలైంది. ఓ ప్రభుత్వోద్యోగి డ్యూటీలో ఉండగా అలా చేయడం తప్పనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్‌ ఆలయంలో జరిగిన కార్యక్రమానికి ఆలయ ప్రధానార్చకుడి హోదాలో యోగి ఆదిత్యానాథ్‌ హాజరయ్యారు. భద్రత ఏర్పాట్ల కోసం వచ్చిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సింగ్‌ యూనిఫాంలోనే యోగి ఆశీస్సులు తీసుకున్నారు. తలపై రుమాలు కప్పుకొని మోకాళ్లపై కూర్చొని ఆదిత్యనాథ్ కి మొక్కారు. యోగి నుదుట తిలకం దిద్ది మెళ్లో పూలమాల అలంకరించారు.ప్రవీణ్ కుమార్ సింగ్ తను యోగికి గురుపూజ చేసిన మూడు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ‘ఫీలింగ్‌ బ్లెస్డ్‌’ అని రాశారు. దీంతో ప్రవీణ్ సింగ్ చర్యపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. యూనిఫాంలో ఉంటూ అలా చేయొచ్చా? అని నిలదీశారు. అయితే ఈ విమర్శలకు ప్రవీణ్‌ ‘నేను సీఎం హోదాలో ఆయనను పూజించలేదు. ఆలయ పెద్దగా భావించి పూజ చేశాన’ని చెప్పారు.
కొందరు మాత్రం ప్రవీణ్ చర్యను సమర్ధించారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలను హిందూ సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారని గుర్తు చేశారు. పోలీసు అధికారి అయినంత మాత్రాన వాళ్ల మతవిశ్వాసాలను ప్రశ్నించరాదని.. ఐదు నిమిషాల పూజ కోసం యూనిఫామ్ మార్చడం దేనికని భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.