రతన్ టాటాతో బ్రిటన్ పీఎం భేటీ

బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే, వాణిజ్య మంత్రి గ్రెగ్ క్లార్క్ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో మూడు వారాల క్రితం భేటీ అయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవడం (బ్రెగ్జిట్)తో టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మక కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ పై ప్రభావం, ఇంగ్లాండ్ ప్రభుత్వ డీజిల్ విధానాలపై టాటా గ్రూప్ కి చుక్కానిలా వ్యవహరిస్తున్న రతన్ టాటాతో చర్చించారు.నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా గ్రూప్ 2008లో కొనుగోలు చేసింది. పునరుత్తేజం కలిగించేందుకు బిలియన్ల కొద్దీ పౌండ్లు కుమ్మరించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను బ్రిటన్ లోనే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా మార్చింది. ప్రస్తుతం బ్రిటన్ రోడ్లపై తిరిగే ప్రతి మూడు కార్లలో ఒకటి ఆ సంస్థవే. కానీ ఇటీవల కొన్ని నెలలుగా ప్రధాన మార్కెట్ అయిన చైనాలో అమ్మకాలు క్షీణించడం, యూరోప్ లో డీజిల్ వినియోగంపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో కార్ల ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది.బ్రెగ్జిట్ కారణంగా ఏటా 1.2 బిలియన్ పౌండ్లు (1.6 బిలియన్ డాలర్లు నష్టపోవాల్సి వస్తుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి వస్తే బ్రిటన్ లోని ప్లాంట్లను కొనసాగించడం అనుమానమేనని చెబుతున్నారు.