రమ్య పదవిలో ఉన్నట్టా? లేనట్టా??

ప్రకాశ్, న్యూఢిల్లీ:

కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్, మాజీ ఎంపీ దివ్య స్పందన అలియస్ రమ్య తన పదవికి రాజీనామా చేసినట్లేనా? రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ని సోషల్ మీడియాలో పెంచే బాధ్యతను చేపట్టిన దివ్య స్పందన, ప్రస్తుతం పార్టీలో తన పాత్రను తగ్గిస్తున్నట్టు భావించి అలక బూనినట్టు తెలిసింది. ఆమె బాధ్యతల పరిధిని చాలా వరకు తగ్గించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వ్యవహారాలపై అలిగిన రమ్య తన సోషల్ మీడియా చీఫ్ పదవికి రాజీనామా చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె తన ట్విట్టర్ ప్రొఫైల్ లో సోషల్ మీడియా పదవిని తొలగించడమే దీనికి రుజువని చెబుతున్నారు. దీనిపై పెనుదుమారం చెలరేగుతుండటంతో రమ్య వెంటనే తన బయోలో తిరిగి సోషల్ మీడియా చీఫ్ అని తిరిగి చేర్చారు.ఇటీవల జరిగిన పలు పార్టీ కార్యక్రమాలకు దివ్య స్పందన డుమ్మా కొట్టింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్థాలో నిర్వహించిన పార్టీ కీలక నాయకత్వ సమావేశానికి కూడా రమ్య హాజరు కాలేదు. గత మూడు రోజులుగా ఆమె తన సహచరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా కార్యాలయం మొహం కూడా చూడలేదని సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టేనని అంటున్నారు. తన పదవికి రాజీనామా చేసినట్టు పుకార్లు రాగానే దివ్య స్పందన పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలాకు ఫోన్ చేసి త్వరలోనే తను తిరిగి పని ప్రారంభిస్తానని తెలిపారు.కాంగ్రెస్ మాజీ ఎంపీ మార్గరెట్ ఆల్వా కుమారుడు నిఖిల్ ఆల్వాకు తన బాధ్యతల్లో చాలా వరకు బదలాయించడంపై దివ్య స్పందన ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ ను నిర్వహిస్తున్న నిఖిల్ కు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ లో కూడా కీలక బాధ్యతలు అప్పజెప్పడం తనకు పరిధులు విధించడమేనని రమ్య భావిస్తోంది. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దివ్య స్పందన వివాదాస్పద ట్వీట్లు చేయడంపై అధ్యక్షుడు రాహుల్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రధానిని ‘దొంగ‘ అనే ట్వీట్ తో యుపి పోలీసులు ఆమెపై రాజద్రోహం కేసు పెట్టారు. అలాగే ప్రధాని మోడీ విద్యార్హతలపై రమ్య ట్వీట్ వివాదాస్పదమైంది. సోషల్ మీడియా చీఫ్ గా ఆమె హద్దులు మీరి దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.