రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్ట్ షాక్!!

న్యూఢిల్లీ:
ఢిల్లీ హైకోర్టులో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్తానా రాకేష్‌కు చుక్కెదురైంది. తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ వేసిన పిటీషన్‌ను కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తానాతో పాటు ఈ కేసులో మరో ముద్దాయిగా ఉన్న దేవేందర్‌ కుమార్‌ పిటీషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఈ కేసును సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నజ్మి వజిరి విచారించారు. రాకేష్‌ ఆస్తానా తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ అమరేంద్ర సరణ్‌ వాదించారు. ఓ నిందితుని స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధం. సవరించిన చట్టంలోని సెక్షన్‌ 17(ఏ) కింద కేసు నమోదు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి ఆయన వాదించారు. ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఏమైనా ఆంక్షలు ఉంటాయా అంటూ ఆస్తానా లాయర్‌ను ఈ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే.. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టుకు సీబీఐ లాయర్‌ తెలిపారు. జడ్జి వేసిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ… ఐపీసీ 120బీ కింద ఆస్తానా, దేవేందర్‌ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ లాయర్‌ తెలిపారు. ఆస్తానా కేసు విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆస్తానాపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని సూచించింది. ఈలోగా ఆస్తాన ఆరోపణలకు జవాబు ఇవ్వాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.