రాజకీయాల్లో పోలీసుల సక్సెస్ గ్రాఫ్ తక్కువ.

లక్ష్మీనారాయణ ఏ పార్టీ లోనైనా చేరవచ్చును.ఆయనకు ఆ స్వేచ్ఛ ఉన్నది.కానీ పోలీసు అధికారులు రాజకీయాల్లో రాణించిన సందర్భాలు చాలా తక్కువ.వాళ్ళు త్వరగా, చొరవగా ప్రజల్లో మమేకం కాలేనకపోవడమో, లేదా ప్రజలు పోలీసులను మిత్రులుగా కంటే, ‘విలన్లు’ గా మాత్రమె చూసే మానసిక పరిస్థితో తెలియదు కానీ రాజకీయాల్లో పోలీసుల సక్సెస్ గ్రాఫ్ చాలా తక్కువ.

విజయవాడ;
రాజకీయాల్లో బ్యూరోక్రాట్లు చేరడం కొత్తకాదు.కానీ పోలీసు అధికారులు రాజకీయాల్లో సక్సెస్ అయిన ఘటనలు అరుదు.తెలుగు రాష్ట్రాల్లో విజయరామారావు,డి.టి.నాయక్,దినేష్ రెడ్డి, వంటి పలువురు ఐ.పి.ఎస్., నాన్ ఐ.పి.ఎస్. అధికారులను చూశాం.ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసు అధికారులు,ఐ.ఏ.ఎస్.అధికారులు రాజకీయాల్లోకి రావడం, పోవడం వంటి సన్నివేశాలున్నాయి.అందులో ఎక్కువ మంది కొంతకాలం ‘వెలుగు’ వెలిగి తర్వాత కనుమరుగైనవాళ్ళు ఎక్కువ.ఇప్పుడు తాజాగా మరో ఐ.పి.ఎస్.అధికారి లక్ష్మీనారాయణ రాజకీయ రంగస్థలంలో వేషం వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి.ఐ.పి.ఎస్.లక్ష్మీ నారాయణ కన్నా ఆయన పేరు సిబిఐ జె.డి.గానే బాగా ప్రజాదరణ పొందింది.అందుక్కారణం జగన్ కేసు విచారణ జరపడమే. హై ప్రొఫైల్ కేసులు విచారించినపుడు సహజంగానే సంబంధిత విచారాణాదికారి కూడా విపరీతమైన ప్రచారాన్ని పొందుతారు.అందులోనూ జగన్ వ్యతిరేక మీడియా, చంద్రబాబు అనుకూల మీడియా లక్ష్మీ నారాయణను ఆకాశానికేత్తాయి.అది ఆయన వృత్తిలో భాగంగా నేర విచారణ జరిపినప్పటికీ ఆయన ఒక గొప్ప సామాజిక సేవ చేస్తున్నట్టు,నేర పరిశోధనను ఎలాంటి భయ సందేహాలు లేకుండా నిష్పాక్షికంగా జరిపినట్టు ఆయా మీడియా సంస్థలు కలర్ ఇచ్చాయి.ఇక ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారు?ఏం చేయనున్నారు?వంటి అంశాలపై ఊహాగానాలు సాగుతున్నాయి.కొందరు విలేకరులు ఆసక్తికరమైన వార్తాకథనాలను వండి వార్చుతున్నారు. మహారాష్ట్ర అదనపు డి.జి.గా ఉండిన లక్ష్మీనారాయణ ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకున్నారు.రాజకీయాల్లో చేరే ఉద్దేశమేదీ లేదని ఒకసారి అన్నారు.వ్యవసాయ మంత్రి అయితే రైతుల కోసం ఏమి చేయవచ్చునో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరో సందర్భంలో చెప్పారు.వ్యవసాయమంత్రి కాకుంటే సామాజికవేత్తగా ఏమి చెయ్యాలో చూస్తానని కూడా అన్నారు.పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన లో లక్ష్మీనారాయణ చేరవచ్చునని మొదట్లో కొన్ని కధనాలు వచ్చాయి.వాటిని ఆయన ఖండించారు.ఆయన ఏ రాజకీయ సిద్ధాంతాల వైపు ఆకర్షితులు కానున్నారో ఇంకా క్లారిటీ లేదు.తాజాగా బిజెపి లో ఈ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేరతారంటూ వార్తలు వస్తున్నవి.ఇందుకు సపోర్ట్ గా లక్ష్మీనారాయణ కొందరు ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తలతో దిగిన ఫోటోను ప్రచారంలో పెట్టారు.రాజకీయాల్లోకి రావడం, శాసన సభ్యునిగా ఎన్నిక కావడం,ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి రావడం…..ఇవన్నీ ఊహాజనితమైనవే కావచ్చు.కానీ వాటికి ఆయనే తగిన ఊతం అందిస్తున్నారు. అయితే తాను ఏ రాజకీయపార్టీలోనూ చేరే అంశంపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తానని,ప్రజల సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత ఏ పార్టీలో చేరాలో నిర్నయిస్తానని ఆయన అంటున్నారు.ఎపి కి ప్రత్యెక హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని ఆయన సమర్థించారు.ఆ పోరాటం బిజెపికి వ్యతిరేకమైనది. అలాంటప్పుడు ఆయన బిజెపిలో ఎలా చేరతారన్నది మిస్టరీ.
కాగా మావోయిస్టూ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు,అధికార ప్రతినిధిగా ఆజాద్ పేరిట పాపులర్ అయిన అసాధారణ మేధావి, విప్లవకారుడు చెరుకూరి రాజ్ కుమార్, ధిల్లీ కి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే లను నాగపూర్ లో పట్టుకుని ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో 8 సంవత్సరాల క్రితం పోలీసులు ఎన్ కౌంటర్ పేరిట కాల్చిచంపారు.కానీ ఇవి హత్యలు కావని, నిజమైన ఎన్ కౌంటర్ లోనే చనిపోయారని కోర్టుకు రిపోర్టు ఇచ్చారని ఐ.పి.ఎస్.లక్ష్మీనారాయణ పై పౌరహక్కుల సంఘాలు గతంలో ఆరోపించాయి. మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఏ పార్టీ లోనైనా చేరవచ్చును.ఆయనకు ఆ స్వేచ్ఛ ఉన్నది.కానీ పోలీసు అధికారులు రాజకీయాల్లో రాణించిన సందర్భాలు చాలా తక్కువ.వాళ్ళు త్వరగా, చొరవగా ప్రజల్లో మమేకం కాలేనకపోవడమో, లేదా ప్రజలు పోలీసులను మిత్రులుగా కంటే, ‘విలన్లు’ గా మాత్రమె చూసే మానసిక పరిస్థితో తెలియదు కానీ రాజకీయాల్లో పోలీసుల సక్సెస్ గ్రాఫ్ చాలా తక్కువ.లక్ష్మీనారాయణ కూడా ఇందుకు మినహాయింపు కాదు.