రాజీవ్ – అమితాబ్ కుటుంబాల మధ్య బీటలు.

ప్రకాశ్, న్యూడిల్లీ:
దేశ ప్రథమ కుటుంబం గాంధీలకు బాలీవుడ్ షహెన్షా అమితాబ్ బచ్చన్ కి పొసగడం లేదా? ఆరు దశాబ్దాల అనుబంధం పెనవేసుకొన్న గాంధీ, బచ్చన్ కుటుంబాలు కొన్నేళ్లుగా ఎందుకు అంటీ ముట్టనట్టు ఉంటున్నాయి? గాంధీలు, బచ్చన్ల స్నేహం ఎలా నెమ్మదిగా కరిగిపోతూ వచ్చింది? ప్రముఖ రచయిత రషీద్ కిద్వాయ్ వచ్చే వారం విడుదల చేస్తున్న ‘నేతా అభినేత: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ అనే తన పుస్తకంలో రాజీవ్, అమితాబ్ కుటుంబాల మధ్య బంధం క్రమక్రమంగా ఎలా బీటలు వారిందో వివరించారు.గాంధీ-బచ్చన్ కుటుంబాల స్నేహగాథ అలహాబాద్ లోని నెహ్రూ-గాంధీ కుటుంబ నివాసం ఆనంద్ భవన్ లో మొదలైంది. సరోజినీ నాయుడు అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి అయిన డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్, ఆయన భార్య తేజీని ఆనంద్ భవన్ కి ఆహ్వానించడంతో ఈ ప్రయాణం మొదలైంది. వాళ్లిద్దరిని సరోజినీ నాయుడు కవి, ఆయన కవితగా ఇందిరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఇందిర కూడా ఎవరికైనా వారిని పరిచయం చేసేటపుడు అవే మాటలు వాడేవారు. అప్పటికి అవివాహిత అయిన ఇందిరతో తేజీకి మంచి స్నేహం కుదిరింది. అలా ప్రారంభమైన స్నేహం బలమైన బంధంగా మారి కష్టసుఖాల్లో ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలిచే స్థాయికి చేరింది.ఇక రాజీవ్ గాంధీ, అమితాబ్ లు బాల్యమిత్రులు. ఒకరినొకరు గాఢంగా విశ్వసించేవారు. ఎంతగా అంటే సోనియా భారత్ కి వచ్చినపుడు 43 రోజులు బచ్చన్లతోనే నివసించారు. ఫిబ్రవరి 25న పెళ్లికి ముందు భారత్ వచ్చిన ఆమెను హోటల్ లో ఉంచడం ప్రధాని ఇందిరకు సుతరామూ ఇష్టం లేదు. దీంతో సోనియాని బచ్చన్ల ఇంట్లో ఉంచి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించాలనుకున్నారు.

1968, జనవరి 13న ఢిల్లీ పాలమ్ ఎయిర్ పోర్ట్ లో ఆమె విమానం దిగినపుడు చలి వణికిస్తున్నప్పటికీ ఆమె కోసం వేచి చూసి ఆమెను అమిత్ స్వయంగా ఇంటికి తీసుకువెళ్లారు. సోనియా కూడా ఓ సందర్భంలో కన్నతల్లి, తల్లిలా చూసుకున్న అత్తగారి తర్వాత మూడో అమ్మ తేజీ బచ్చన్ అని చెప్పారు. అమిత్ (అమితాబ్), బంటీ (అజితాబ్) తన తోబుట్టువుల్లాంటి వారన్నారు.1996-1998 మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్ స్థాపించిన ఏబీసీఎల్ కార్పొరేషన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అదే సమయంలో రెండు కుటుంబాల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. డబ్బు వివాదాలు, గాంధీ-బచ్చన్ పిల్లల వివాహ వ్యవహారాలే కారణమనే పుకార్లు షికార్లు చేశాయి. వీటికి జాతకాలపై బచ్చన్ల నమ్మకం తోడైంది. 1997లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సీతారామ్ కేసరి వైదొలిగి సోనియాకు పగ్గాలు అప్పగించబోయే సమయంలో బచ్చన్లు సోనియా జాతకచక్రం వేయించి ఆమె రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉండదని, నాయకత్వం సుదీర్ఘ కొనసాగే అవకాశాల్లేవని తెలిపారు. ఇవి కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచాయి. పిల్లలు తమ కుటుంబాల మధ్య బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారని స్వయంగా అమితాబ్ ఓ సారి చెప్పారు. దేశ ప్రథమ కుటుంబమైన తమతో సాన్నిహిత్యాన్ని వాడుకొని అమితాబ్, ఆయన సోదరుడు లాభపడ్డారని గాందీ కుటుంబం భావించింది. రాజీవ్ మరణానంతరం లండన్ లో ఉన్న సోనియాని పరామర్శించేందుకు బచ్చన్ పరివారం అయిష్టంగానే వెళ్లినట్టు తెలుస్తోంది.రాజీవ్-సోనియాల కుమార్తె ప్రియాంక, బచ్చన్ కూతురు శ్వేతాల పెళ్లిళ్లతో ఇరు కుటుంబాల సంబంధాలు ఎన్నటికి కలవని స్థాయికి చేరాయి.

1997, ఫిబ్రవరి 18న ప్రియాంక పెళ్లి రాబర్ట్ వాద్రాతో జరగింది. అంతకు ముందు రోజే శ్వేతా పారిశ్రామికవేత్త నిఖిల్ నందాను పెళ్లాడింది. ప్రియాంక పెళ్లి విషయం ఎంతో ముందుగానే తెలిసినప్పటికీ అమితాబ్ ఉద్దేశపూర్వకంగా 45 రోజుల ముందు నిశ్చితార్థం జరిపి ఒక రోజు ముందు అట్టహాసంగా తన కూతురు పెళ్లి చేసి యావద్దేశం దృష్టిని మరల్చారని గాంధీ కుటుంబం రగిలిపోయింది. దీంతో రెండు పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన అతిథుల్లో కొందరు ప్రియాంక పెళ్లికి హాజరు కాలేదు. ఈ వ్యవహారాలన్నీ మౌనంగా గమనిస్తున్న సోనియా తీవ్రంగా మనస్థాపం చెంది బచ్చన్ కుటుంబంతో సంబంధాలను తెగదెంపులు చేసుకొనేందుకు నిర్ణయించుకున్నారు. శ్వేతా పెళ్లికి కూడా ఆమె వెళ్లలేదు. ఆ తర్వాత 1999లో అభిషేక్ బచ్చన్ తెరంగేట్రం చేసిన ‘రెఫ్యూజీ’ ప్రీమియర్ కి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించడంతో రెండు ప్రముఖ కుటుంబాల అపురూప స్నేహబంధానికి తెర పడినట్టయింది.