రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కి హోరాహోరీ.

న్యూఢిల్లీ:
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. అధికార ఎన్డీఏ, విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎట్టి పరిస్థితుల్లో పెద్దల సభ డిప్యూటీ చైర్మన్ సీటు దక్కనివ్వరాదని పట్టుదలగా ఉన్న ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్ ను ఎంపిక చేశాయి. అటు ఎన్డీఏ తన అభ్యర్థిగా జేడీయు నేత, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సన్నిహితుడైన హరివంశ్ నారాయణ్‌సింగ్ ను పోటీకి నిలిపింది. రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడంతో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై చర్చించేందుకు సమావేశమైన విపక్షాలు అన్ని పార్టీల సమ్మతితో ఉమ్మడి అభ్యర్థిగా వందనా చవాన్ ని బరిలోకి దింపాయి. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 90 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. తమకి రాజ్యసభలో తగినంత బలం లేనందున ఏఐఏడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ పార్టీలు మద్దతిస్తే ఎన్డీఏ బలం 126కు చేరుతుంది. వీటిలో ఏ పార్టీలైనా ఓటింగ్‌కు దూరంగా ఉంటే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది.