రాఫెల్ కుంభకోణం విలువ 1,30,000 కోట్లు


న్యూఢిల్లీ:

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి బలమైన అస్త్రంగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఆరోపణలు గుప్పిస్తోంది హస్తం పార్టీ. తాజాగా రాఫెల్ డీల్ లో రూ.1,30,000 కోట్ల కాంట్రాక్ట్ ని ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక గ్రూప్ కి కట్టబెట్టారని దాడి ప్రారంభించింది. ఈ దాడికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు.రాఫెల్ కొనుగోళ్లలో తనపై దాడి జరగడం బాధించిందని రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) చైర్మన్ అనిల్ అంబానీ తనకి వ్యక్తిగతంగా లేఖ రాసిన మర్నాడే రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన కార్పొరేట్ సంబంధాలపై దాడిని తీవ్రతరం చేశారు. కంపెనీ రిపోర్ట్ తో అడాగ్ చైర్మన్ ఉన్న ఫోటోని ట్వీట్ చేస్తూ ‘మిస్టర్ 56 గారు కనీసం ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నారు. 1. (అతను) సూట్ వేసుకోవాలి. 2. రూ.45,000 కోట్ల అప్పు ఉండాలి. 3. కంపెనీ పెట్టి పది రోజులే కావాలి. 4. తన జీవితంలో ఎన్నడూ ఒక విమానం తయారుచేసి ఉండకూడదు. ఇవన్నీ కనుక మీకుంటే మీకు 4 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ బహుమతిగా ఇవ్వబడుతుంది‘ అని రాశారు.తన ట్వీట్ ని ట్విట్టర్ లో ట్రోల్ చేయడంతో రాహుల్ మరో అస్త్రం ప్రయోగించారు. ఇంతకు ముందు ట్వీట్ లో తను మిస్టర్ 56 మిత్రుడికి 4 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ దక్కిందని మాత్రమే చెప్పానని అందుకు క్షమించాలని కోరారు. 16 బిలియన్ డాలర్ల విలువైన రాఫెల్ యుద్ధవిమానాల లైఫ్ సైకిల్ కాంట్రాక్ట్ చేర్చడం మర్చిపోయానని ట్వీట్ చేశారు. అంటే దీని మొత్తం విలువ 20 బిలియన్ డాలర్లు అంటే రూ.1,30,000 కోట్లు అని ట్వీటి సంచలనం రేపారు.