రాష్ట్రంలో ఆటవిక పాలన. – ఉత్తమ్.

హైదరాబాద్‌:

అటవీశాఖకు చెందిన మహిళా అధికారిపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణరావు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వారి విధులు వాళ్లు నిర్వహిస్తున్నప్పుడు తెరాస నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే తమ్ముడు ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబపాలన, అరాచకం, అశాంతి రాజ్యమేలుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని గుర్తు చేశారు. ఒక మహిళా అధికారిపై ఇలా దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం విచ్చలవిడితనానికి నిదర్శనమని విమర్శించారు. దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.