రాహుల్ గాంధీ ఫిట్ నెస్ సీక్రెట్స్!!

rahul gandhi fitness

న్యూఢిల్లీ:

అర్థరాత్రి జిమ్ లో కసరత్తులు, వీలు చూసుకొని ఇంటి ఆవరణలో నడక.. రోజులో ఎప్పుడు చూసినా బిజీగా ఉండే రాజకీయ నాయకులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. గత తరం నేతల మాదిరిగా తెల్లటి కుర్తాలో కుండబొజ్జలు, ఊబకాయం కప్పేసుకొని తిరగడాన్ని వారు ఇష్టపడటం లేదు. ఈ కాలం నాయకులు సమయం, సందర్భం, ట్రెండ్ కి తగ్గట్టుగా దుస్తులు వేసుకోవాలంటే అవసరమైన ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నారు. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియకపోయినా క్రమం తప్పకుండా కసరత్తులు చేయడాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచుగా ధ్యాన కేంద్రాలకు వెళ్లి రీఛార్జ్ అవుతుంటారు. గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురు..సోనియా, రాహుల్, ప్రియాంక క్రమం తప్పకుండా ధ్యానం చేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ది ప్రింట్ పత్రికకు చెప్పారు. ధ్యానం వల్ల మనసు స్థిరపడటంతో పాటు ఆధ్యాత్మికంగా తేజోమయం అవుతుందని వారు భావిస్తారని సూర్జేవాలా పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రోజూ కసరత్తులు చేసి చెమటోడుస్తారు. రోజు విడిచి రోజు 12 కిలోమీటర్లు పరిగెడతారు. ప్రచారసభలలో పాల్గొని ఇంటికి వచ్చేటప్పటికి అర్థరాత్రి అయినా పరుగు మాత్రం మానరని సూర్జేవాలా వివరించారు. సోనియా, రాహుల్ క్రమం తప్పక యోగా చేస్తారని బాబా రామ్ దేవ్ చెప్పారు.