రూపాయి కోసం రూ.7 రద్దు!!

న్యూఢిల్లీ;
సామాన్యుడు అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ చివరి రూపాయిని సైతం ముక్కు పిండి వసూలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్లు రుణం తీసుకొన్న బడాబాబులను మాత్రం వదిలేస్తున్నాయి. నాలుగేళ్లలో దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్లు, బడా వ్యాపారవేత్తల నుంచి ఎనిమిది రూపాయల అప్పులో రూపాయిని మాత్రమే వసూలు చేయగలిగాయి. మిగిలిన ఏడు రూపాయలను రాని అప్పుల పద్దులో రాసుకొని వదిలేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా ప్రకారం ఏప్రిల్ 2014 ఏప్రిల్ 2018 మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.3,61,400 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.3,16,500 కోట్ల రుణాలను వసూలు కాని అప్పుల ఖాతాలో చేర్చేశాయి. కేవలం రూ.44,900 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. అంటే వసూలు కాని మొత్తం వసూలైన మొత్తం కంటే ఏడు రెట్లు ఎక్కువ.ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాడ్ లోన్స్ గా చూపించి రాని అప్పుల పద్దులో చూపారో ఆ మొత్తం 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆరోగ్య, విద్య, సామాజిక భద్రతకయ్యే ఖర్చు (రూ.1.38 లక్షల కోట్లు) కంటే రెండు రెట్లు ఎక్కువ. ఏప్రిల్ 2014-ఏప్రిల్ 2018 మధ్య కాలంలో 21 బ్యాంకులు ఎంత మొత్తం మాఫీ చేశాయో అదంతా 2014 వరకు వసూలు కాని అప్పుల మొత్తం కంటే 166 శాతం ఎక్కువ. పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ ముందు ఇచ్చిన వివరణలో ఆర్బీఐ ఈ వివరాలను పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లో నాలుగేళ్లుగా మార్చి 2018 చివరకు రుణాల రికవరీ రేట్ 14.2 శాతం మాత్రమే. ప్రైవేట్ బ్యాంకుల రికవరీ రేట్ 5 శాతంగా ఉంది. దేశంలో మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో 21 ప్రభుత్వ బ్యాంకుల వాటా 70 శాతంగా ఉంది. బ్యాంకింగ్ రంగంలోని మొత్తం నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) మొత్తంలో పీఎస్బీల రాని అప్పులే దాదాపు 86 శాతం కావడం కచ్చితంగా ఆందోళన కలిగించేదే. 2014-15లో 4.62 శాతం ఉన్న ఎన్పీఏలు 2015-16లో 7.79 శాతానికి పెరిగాయి. డిసెంబర్ 2017 వరకు ఇవి 1041 శాతానికి చేరాయి. 2017 చివరి నాటికి ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల ఎన్పీఏ సుమారు రూ.7.70 లక్షల కోట్లు. రాని అప్పుల ఖాతాలో రాసుకొని బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్ ను మెరుగ్గా చూపించుకోవడం సాధారణంగా జరిగే వ్యాపార నిర్ణయమేనని సీనియర్ బ్యాంకు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.