రూ.2000 నోటు చిరిగిందా. మార్చడం కష్టమే..

  • రూ.200 నోటు విషయంలోనూ అదే పరిస్థితి
    తిరస్కరిస్తున్న బ్యాంకులు.
    స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని ఆర్‌బీఐ

 

హైదరాబాద్:
మన దగ్గర ఎవైనా నోట్లు చిరిగినా.. పాడైపోయినా.. వాటిని మన దగ్గర్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి తీసుకెళ్లి ఇస్తాం. వాటి స్థానంలో చెల్లుబాటయ్యే నోట్లు ఇస్తారు. బ్యాంకులు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులు కూడా చిరిగిన నోట్లకు బదులుగా మంచి నోట్ల ఇస్తుంటారు. కాకపోతే కొంచెం కమీషన్‌ తీసుకుంటారు. అయితే పాత రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి రూ.2000 నోటు వచ్చింది. కొత్త భద్రలతో ఈ నోటు వచ్చి ఏడాదిన్నరకు పైగా అవడంతో ఇది కూడా పాతబడింది. ఇదే సమయంలో కొన్నిసార్లు అనుకోకుండా చిరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. వినియోగదారులు చిరిగిపోయిన, లేదా పాడైన రూ.2000 నోటును బ్యాంకుకు తీసుకెళ్తే.. చాలావరకు బ్యాంకులు తీసుకోవడం లేదు. దానికి సరిపడా నోటును లేదా నోట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. కొంతకాలం ఆగాల్సిందే..
చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు. వాస్తవంగా చిరిగిపోయిన నోటుకు ఎంత విలువ కట్టి ఇవ్వాలనే విషయమై గతంలోనే ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రూ.2 వేలు, రూ.200 నోట్లకు ఈ నిబంధనలు వర్తించకపోవడంపై ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఏ నిబంధన ప్రకారం నోట్లను మారుస్తారు?
రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (నోట్‌ రిఫండ్‌) రూల్స్‌-2009 ప్రకారం రూ.50 పైబడిన నోట్లు చిరిగినా, పాడైనా ఒకే నిబంధనను అమలు చేస్తారు. చిరిగిపోయిన నోటులో పెద్ద భాగం ఎంత ఉందనే దాన్ని బట్టి విలువ కట్టి తిరిగి డబ్బులు ఇస్తారు. ఇప్పటివరకు 50, 100, 500,1000 రూపాయలకు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. చలామణిలోకి వచ్చిన రూ.2వేలు, రూ.200 నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకులు వాటిని తిరస్కరిస్తున్నాయి.పెద్దనోట్ల రద్దు తర్వాత జారీ చేసిన కొత్తనోట్లను చూస్తే.. అవి పాత నోట్లతో పోలిస్తే..  చిన్నవిగా (రూ. 100 తప్ప) ఉన్నాయి. పాత రూ.50 నోటుతో పోలిస్తే.. రూ.2000 నోటు ఇప్పుడు చిన్నదిగా ఉంది. నిబంధనల్లో ఏమో చిరిగిన నోటు పరిమాణాన్ని బట్టి మార్పిడిని సూచించారు. ఈ కారణం వల్ల కూడా బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. రూ.200 నోటు విషయంలోనూ బ్యాంకులు ఇదే సందిగ్దతలో ఉన్నాయి. రూ.2వేలు, రూ.200 నోట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు నిశితంగా పరిశీలన చేసిన తరువాతనే తీసుకోవాలని చెబుతున్నారు