రూ.50 కోట్ల అప్పుంటే పాస్ పోర్టు జప్తు. విదేశాలకు పారిపోకుండా కట్టడి.

న్యూ ఢిల్లీ:
బ్యాంకులకు వేలకు వేల కోట్లు రుణాల ఎగవేసేవారిపై కొరడా ఝుళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో చాలా మంది ప్రమోటర్లు రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోతుండటంతో అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం రూ.50 కోట్ల కంటే ఎక్కువ అప్పు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నవారు దేశం వదిలి విదేశాలకు పారిపోకుండా అడ్డుకోనుంది. అలాంటివారు ముందస్తుగా తెలియపరచకుండా విదేశీ యాత్రకు వెళ్లడంపై ఆంక్షలు విధించనుంది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా ఈ సిఫార్సులు చేసింది. ఈ కమిటీలో ఆర్‌బీఐ ప్రతినిధులు, హోమ్, విదేశాంగ శాఖల ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 10ని సవరించాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. రూ.50 కోట్ల పరిమితికి మించి ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసిన వారిని ప్రజా ప్రయోజనాలకు ఎకానమిక్‌, ఫైనాన్షియల్‌ ప్రమాదకారులుగా పరిగణించాలని నిర్ణయిస్తున్నామని అధికారులు చెప్పారు. వారి పాస్‌పోర్టు వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులను ఆదేశించింది. రూ.14,000 కోట్ల పీఎన్‌బీ కుంభకోణానికి కారకులైన నీరవ్‌ మోడీతో పాటు విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయారు. దీంతో ముందు జాగ్రత్తగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్‌పీఏ అకౌంట్లన్నిటిపై దర్యాప్తు జరపాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.