రేవంత్ వేలిముద్రలు, సంతకాలు సేకరణ.

 

హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు రెండో రోజూ కొనసాగాయి. రేవంత్ ఇంట్లోని కంప్యూటర్లలో డిలిట్ చేసిన సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ బృందం సేకరించింది. రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్లపై అధికారులు ఆరా తీశారు. రేవంత్ భార్య గీతను ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్లారు. 3 బ్యాంకుల్లో లాకర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటుకు నోటు కేసులో సహ నిందితుడైన ఉదయసింహను అధికారులు రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రశ్నించారు. రేవంత్ కి చెందిన వివిధ కంపెనీలకు చెందిన వివరాలను అధికారులు సేకరించారు. రేవంత్ రెడ్డి వివిధ డాక్యుమెంట్లపై చేసిన సంతకాల పరిశీలన కోసం ఫొరెన్సిక్ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చారు. రేవంత్ నుంచి ఆయన సంతకాలను, వేలిముద్రలను సేకరించారు. సంతకాలు, వేలిముద్రలు తీసుకొన్న తర్వాత ఫొరెన్సిక్ బృందం సభ్యులు తిరిగి వెళ్లిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్, పన్ను ఎగ్గొట్టారనే మూడు ప్రధాన అభియోగాలపై అధికారులు రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు.