రైతుల రుణ పరపతి పెంచాలి. చీఫ్ సెక్రెటరీ కి కాంగ్రెస్ నాయకుల విన్నపం.

హైదరాబాద్:
రుణాల విషయంలో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్నారు.రైతుల రుణ పరపతి పెంచాలని కోరుతూ కాంగ్రెస్ నేతల బృందం మంగళవారం ప్రభుత్వ సి.ఎస్.కు ఒక వినతిపత్రం సమర్పించింది. పంట పెట్టుబడి మొత్తం, బ్యాంకులు ఇస్తోన్న రుణానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. రుణపరిమితి పెంచకపోతే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని వారు తెలిపారు.రుణపరిమితి పెంచకపోతే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రైతులకు దీర్ఘకాలిక చర్యలు లేకుండా చందాలు ఇచ్చినట్లు చేస్తే ఫలితం ఉండదని చెప్పారు.రైతు ఆత్మవిశ్వాసం పెంచకుండా తాత్కాలిక సంతృప్తి ఇచ్చేలా జేబులు నింపడం సరిపోదని అన్నారు. అన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి పీసీసీ తరపున సీఎస్ జోషికి నివేదిక అందించామని తెలిపారు.నాలుగేళ్లలో పంటలకు కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర లభించలేదని విమర్శించారు. వడగళ్ల వాన వల్ల నష్టపోతే కనీసం పంట నష్టం వివరాలు సేకరించలేదని చెప్పారు.నాలుగేళ్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొనలేదని విమర్శించారు.కనీస ప్రాథమిక చర్యలు తీసుకోనందువల్లే రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. రుణ పరిమితి పెంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడతామని తెలియజేశారు.రైతుకు ఏ రూపంలో ఎవరు మేలు చేసినా ఇబ్బంది లేదన్నారు.నకిలీలను అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.పౌరసరఫరాల శాఖ సేకరించిన ధాన్యానికి సంబంధించిన 1500 కోట్ల రూపాయల బకాయిలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కందులు, మొక్కజొన్న బకాయిలు కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ ప్రణాళిక విడుదల చేయలేదన్నారు.రైతుల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.బీటీ3 తో రైతులు దారుణంగా నష్టపోతున్నారని తెలిపారు.రైతుబంధు అన్నింటికీ జిందా తిలిస్మాత్ అన్నట్లు ప్రభుత్వం వ్యవరిస్తోందన్నారు. కేవలం ఓట్ల బంధు పథకాలు పెడితే ఏం లాభం ?అని ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ జోషీ ని కలిసిన వారిలో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్ రెడ్డి, శ్రవణ్ దాసోజు, పొంగులేటి, కోదండరెడ్డి ఉన్నారు.