రైలు విమానం వచ్చేస్తోంది!!

ప్రాన్సు:
ఒక విమానం రన్ వేపై దిగింది. వెంటనే దాని రెక్కలను ముడుచుకొని రైలు పట్టాలపై పరుగులు ప్రారంభించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. వినడానికి హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే స్కూటర్లు, కార్లు, ఇతర వాహనాల వర్ణనలాగా అనిపించినా ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఎగిరే రైలు త్వరలోనే వాస్తవరూపం దాల్చనుంది.
విమానం దిగిన తర్వాత ఎంత త్వరగా ఇంటికి చేరతామా అని అంతా ఆత్రుత పడతారు. కానీ బ్యాగేజీ కోసం వేచి చూడటం, బయటికొచ్చిన తర్వాత ట్యాక్సీలు, బస్సుల కోసం ఎదురుచూపులతో గంటలు గడిచిపోతాయి. ఈ పాయింట్ పట్టుకొన్న ఓ ఫ్రెంచి వ్యాపారవేత్తకు ఎగిరే రైలు అనే క్రేజీ ఐడియా వచ్చింది. వెంటనే కొందరు ఇంజనీర్లు, పారిశ్రామిక సంస్థలను కలిసి ఈ వినూత్న ఊహకు కార్యరూపం ఇవ్వడం ప్రారంభించాడు. ప్రముఖ విమాన తయారీ సంస్థలు బోయింగ్ వంటి కంపెనీలకు తన ఆలోచనలు వివరించాడు. మిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించాడు.
అక్కా టెక్నాలజీస్ అనే సంస్థ వెంటనే రంగంలోకి దిగి దీనిపై ప్రయోగాలు ప్రారంభించింది. లింక్ & ఫ్లై అని ఈ ప్రాజెక్టుకి నామకరణం చేసింది. టికెట్ బుక్ చేసుకొన్న ప్రయాణికులు తమ దగ్గరి స్టేషన్ కి వెళ్లి ట్రెయిన్ మాదిరిగా కనిపించే ఓ ట్యూబ్ ఎక్కి విమానాశ్రయానికి వెళ్లే దారిలో సెక్యూరిటీ చెక్ కోసం తమ రెటీనాలు స్కాన్ చేయించుకోవాలి. అలా విమానాశ్రయం చేరగానే ఆ వాహనం రన్ వేపై పరుగు ప్రారంభిస్తుంది. దానికి ఉన్న రెక్కలు తెరచుకొని గాలిలోకి టేకాఫ్ అవుతుంది. ఎయిర్ బస్ ఏ320 జెట్ సైజులో 34 మీటర్ల పొడవుండే అక్కా లింక్ &ఫ్లై 162 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. సామాగ్రి రవాణాకు అదనంగా స్థలం కావాలంటే కొన్ని సీట్లు తీసేసే వీలుంది. 8 మీటర్ల ఎత్తయిన ఈ రైలు విమానం రెక్కలు విప్పితే 49 మీటర్ల వెడల్పు ఉంటుంది. కింద రైలు తరహాలో నడవాల్సి ఉండటంతో దీనికి ఇంజన్లను పైన అమర్చారు.అక్కా టెక్నాలజీస్ తయారుచేసిన ఈ నయా రైలు విమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన తయారీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సంస్థ ఎయిర్ బస్ ఎస్ఈ, రెనో ఎస్ఏ వంటి యూరప్ కు చెందిన దిగ్గజ సంస్థలపై మాత్రమే ఆధారపడకుండా బోయింగ్ వంటి బడా ఉత్పత్తిదారులను సైతం ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తాము తయారుచేసిన త్రీడీ వీడియోని ఇప్పటికే ఆసియా వంటి దేశాల్లో పలు విమానయాన కంపెనీలకు ప్రదర్శించింది.