రోడ్డు ప్రమాదంలో 6 గురు దుర్మరణం.

కోయంబత్తూరు:
అతివేగం కారణంగా అదుపుతప్పిన ఆడి కారు ఆటోను ఢీకొట్టి.. పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రత్నమ్‌ కాలేజీ యాజమాని మధన్‌ కే సెంథిల్‌కు చెందిన ఆడి కారు పొల్లాచి నుంచి కోయంబత్తూరుకు బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్‌ అతివేగం కారణంగా అదుపుతప్పిన కారు సుందరాపురం వద్ద ఓ ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న బస్టాప్‌లోని ప్రయాణికులపైకి దూసుకుపోయింది.దీంతో నారాయణసామి(70), హంసవేణి(34), సుభాషిణి(18), కుప్పమ్మాల్‌(70), శ్రీరంగదాస్‌(69) సోను.. అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డవారిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడా? అన్న అనుమానంతో అతని రక్త నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ సంఘటనపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.