రోహిణి కార్తె:నాట్లు.

రత్నకుమార్,గుంటూరు.
కేసీఆర్ మాటల్లో నిజంపాలెంతన్నది కాసేపు పక్కన పెడితే ఆయన మాటలు ఎదుటివారిని(గిట్టనివారిని సైతం) మంత్రముగ్దుల్ని చేసిపారేస్తాయి. ఆయన చెప్పే తీరు అలా ఉంటుంది మరి! రోహిణి కార్తెలోనే నాట్లు వేసుకునే పరిస్థితి తెలంగాణ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టుతో వస్తుందని చెప్పడం ఇలాంటిదే! వ్యతిరేకులు సైతం ఓ అరగంట పాటు ఆయన మాటలు వింటే..వాళ్ళే నిదానంగా ఆయన వాదనతో ఏకీభవించే స్థాయికి వచ్చేస్తారు. అందుకే ఆయనకు ‘మాటల మరాఠీ’ అనే పేరు ఉద్యమకాలంలోనే వచ్చింది. ఈ నేర్పుతోనే అనేకమంది వ్యతిరేకులను విజయవంతంగా తనవైపు తిప్పుకున్నారాయన! వేసవికాలంలో అందులోనూ రోహిణి కార్తెలో రైతులెవరూ పొలాలవైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ దశలో నాట్లు వేసే అంశం ఎవడికీ కనీసం ఊహకు సైతం అందదు. కానీ ఆ సమయంలోనే నాట్లు వేసుకునే పరిస్థితి వస్తుందని కేసీఆర్ చెప్పడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో  తెలంగాణలో చెరువులు 365రోజులూ నీటితో నిండుగా ఉంటాయనీ కాబట్టి రోహిణి కార్తెలోనే నాట్లు వేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతు బీమా పథకంపై హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది.