లక్ష కోట్లతో పాక్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులు.

ఇస్లామాబాద్:

కొత్త డిజిటల్ వాచ్ తయారు చేస్తున్న స్టార్టప్ లో పెట్టుబడి పెట్టండి.. బద్దలు కాని ఫోన్ కేస్ తయారుచేసే కంపెనీలో మదుపు చేయండి.. ఫేస్ బుక్ లో ఇలాంటి స్పాన్సర్డ్ పోస్టులు చాలానే చూశాం. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలాంటి పోస్టింగులే పెట్టబోతున్నారు. పాక్ అత్యవసరంగా డ్యాములు నిర్మించాలి. ఈ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్లు అవసరం. దేశహితం కోసం ఈ మొత్తాన్ని విరాళం ఇవ్వాలని ప్రజలను కోరుతోంది పాక్ ప్రభుత్వం.ఇంత కాలం రెండు భారీ డ్యాములతో పాకిస్థాన్ గడుపుతూ వచ్చింది. పెరుగుతున్న జనాభాకి తగ్గట్టు డ్యాములను నిర్మించకపోతే 2025 నాటికి తీవ్ర నీటి ఎద్దడి తప్పదన్న నిపుణుల హెచ్చరికలతో ఇమ్రాన్ ప్రభుత్వం మేల్కొంది. దేశంలోని డ్యామ్ లు 30 రోజులకు సరిపడే నీరు మాత్రమే నిల్వ చేయగలవని.. దీనిని పెంచుకోకపోతే దేశం చిక్కుల్లో పడుతుందని ఈ నెల మొదట్లో టీవీ ద్వారా దేశప్రజలకు ఇచ్చిన సందేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఇప్పటికే దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని.. బయటి నుంచి అప్పు తెచ్చి డ్యాములు కట్టే పరిస్థితి కాదని చెప్పారు. అందువల్ల మన డబ్బుతో మనమే ఆనకట్టలు కట్టుకుందామని పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉండే లక్షలాది పాకిస్థానీలు స్వదేశానికి తలా 1,000 డాలర్లు ఇస్తే దేశమంతటా డ్యాములు కట్టడం సాధ్యమన్నారు ఇమ్రాన్. మీ డబ్బుకి నాది పూచీ అని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. అయితే విమర్శకులు మాత్రం ఇది నేల విడిచి సాము చేయడమని అంటున్నారు. ప్రజల నుంచి 14 బిలియన్ డాలర్లు సాధించడం అసాధ్యం అని ఆర్థిక విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టేందుకు ఇంత మొత్తం సేకరించిన దాఖలాలు చరిత్రలో లేవని గుర్తు చేస్తున్నారు. గతంలో పెబెల్ టైమ్ స్మార్ట్ వాచ్ కోసం కిక్ స్టార్టర్ 32 రోజుల్లో 20 మిలియన్ డాలర్లు ప్రజల నుంచి సేకరించిన మొత్తమే అత్యధికం. ఇప్పుడు పాక్ ప్రభుత్వం కోరుతున్న మొత్తం దానికి 700 రెట్లు ఎక్కువ కావడంతో ఇది జరిగేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.గతంలో రెండు అద్భుతమైన కేన్సర్ ఆస్పత్రులను ప్రజల నుంచి సేకరించిన 300 మిలియన్ డాలర్ల విరాళాలతో నిర్మించిన ఇమ్రాన్ ఖాన్ నిజాయితీపై ప్రజలకు ఎలాంటి సందేహాలు లేవు. కానీ విరాళాలు ఇవ్వని వారు దేశద్రోహులనే వ్యాఖ్యలపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.