లైంగిక హింసపై పోరాడిన ఇద్దరికి శాంతి నోబెల్.

న్యూఢిల్లీ:

లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆఫ్రికా ఖండంలోని కాంగోకు చెందిన డెన్నిస్ ముక్వేగెతో పాటు యాజిది వర్గానికి చెందిన అత్యాచార బాధితురాలు నదియా మురాద్‌లకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో లైంగిక హింసకు వ్యతిరేకంగా ఈ ఇద్దరూ పోరాడారు. వృత్తిరీత్యా డాక్టరైన డెన్నిస్.. తన యావజ్జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారు. కాంగోలో అంతర్యుద్ధం జరిగిన సమయంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వేలాదిగా లైంగిక వేధింపులకు గురయ్యారు. వారందరికీ డెన్నిస్ చేయూత నందించారు. ఇరాక్ కు చెందిన మరో శాంతి నోబెల్‌ గ్రహీత నదియా మురాద్ స్వయంగా లైంగిక హింసకు గురయ్యారు. ఇరాక్‌లో తనలాగే వేలాదిగా లైంగిక హింసకు గురైన మహిళల తరఫున ఆమె పోరాటం చేసింది. ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సాయుధులు సుమారు మూడు వేల మంది యాజిదీ తెగ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆమె 23 ఏళ్ల వయసులోనే ఐక్యరాజ్యసమితి వేదికగా మాట్లాడింది.