లైసెన్స్ లేకపోతే బైక్ అమ్మేది లేదు.

కోలకతా;
ద్విచక్ర వాహనాలతో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్ ఓ వినూత్న ఆలోచన చేసింది. టూ వీలర్ల కొనుగోలుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. బండి కొనుగోలు సమయంలో డీలర్లకు తమ లైసెన్స్ చూపించాలి. వాహనాల అమ్మకానికి సంబంధించిన రికార్డుల్లో లైసెన్స్ వివరాలు కూడా డీలర్లు నిర్వహించాలి. రవాణా అధికారులు అడిగినపుడు వారికి ఈ రికార్డు చూపించాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన ఆటో డీలర్లపై వాణిజ్య లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే లైసెన్స్ చూపిస్తేనే బండిని అధికారులు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సెంట్రల్ మోటార్ వెహికిల్స్ నిబంధనలనే కఠినంగా అమలు చేస్తున్నామని బెంగాల్ రవాణా మంత్రి సువేందు అధికారి తెలిపారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు టూ వీలర్ ప్రమాదాల్లో పసిపిల్లలు, యువకులు మరణించడం జరిగింది. అన్నిటిలోనూ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగానే జరిగినట్టు గుర్తించారు. దీంతో రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులపై పలు నిబంధనలు అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల తర్వాత ప్రమాదాలు, వాటి తీవ్రతలో కొంత తగ్గుముఖం పట్టినట్టు అధికారులు చెప్పారు. తాజా లైసెన్స్ నిబంధనతో ఇది మరింత తగ్గనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.