లోపల నిప్పు కణికలు ఉన్నవాడు

|| లోపల నిప్పు కణికలు ఉన్నవాడు ||

ఎవడు బతికేను నిండా పది పదులు
నేల తనకోసం కన్నదో
నేలకోసం వాడు పుట్టాడో
అన్నట్లు ఎవడూ పుట్టడు

కానీ
అందరిలానే పుట్టినా
చచ్చేనాటికి దేశ ముఖచిత్రం మీద
ఎడమకాలి ముద్రను తన సంతకంగా
చేసేవాడు మాత్రం అరుదుగా రూపొందుతాడు

పుట్టిన కులం నిషేధమైన చోట
నిషేధాక్షరాలను ఏరి వాక్యాల దండ కట్టడం
తెలిసినవాడు మాత్రమే
కాలిపోతున్న మనుషుల కోసం
మనుషుల్లో కాలిపోతున్న మనసుల కోసం
లోపలా బయటా ధగ్ధమవుతూ రాయగలడు

లోపల నిప్పు కణికలున్నవాడే
బయట మంటల్ని పుట్టించగలడు

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం ‘
‘అంటరాని ప్రేమ’ చేసిన పోరాటం
వాడి జీవితం
వాడు రాచరికాన్ని కూల్చే అరాచకుడు
వాడే ప్రకటించుకున్నట్లు
‘జన సమూహాల గాయం
గాయాల సమూహం’

¬బతకడమొక నిరసనగా బతికిన వాడు మాత్రమే
చావునూ నిరసనగా రిజిస్టర్ చేసి పోతాడు

He lived shorter
But, his life? eternal.