లోయర్ మానేరు డామ్ కాలువ పనులు నెలాఖరులోగా పూర్తి. – మంత్రి హరీశ్ రావు.

కరీంనగర్:
లోయర్ మానేరు డామ్ కింద కాకతీయ ప్రధాన కాలువ క్రిటికల్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు నీటి పారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. కరీంనగర్ ఎల్.ఎం.డి గెస్ట్ హౌస్ లో ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. ఎల్.ఎం.డి కింది కాకతీయ ప్రధాన కాలుపై 146 కిలోమీటర్ల నుంచి 284 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ పనులపై మంత్రి సమీక్ష జరిపారు. గోదావరి వ్యాలీ సర్కిల్ లోని ప్యాకేజీ 1 లో 146 కిలోమీటర్ల నుంచి 191 కిలోమీటర్ల వరకు పనుల పురోగతిని మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. కనస్ట్రక్షన్ సర్కిల్ హన్మకొండ పరిధిలోని 191 కిలోమీటర్ల నుంచి 234 కిలోమీటర్ల వరకు ప్యాకేజీ 2 కింద జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాకతీయ ప్రధాన కాలువపైన క్రిటికల్ వర్క్స్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 40 శాతం వరకు పనులు పూర్తయినట్లు మంత్రికి ఇంజనీర్లు తెలిపారు. మిగతా పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నారు. కాలువ లోని అండర్ టన్నెల్, ఆప్టెక్, స్లూయిస్,కాలువ గట్లు, లైనింగ్ పనులు వేగంగా చేయాలన్నారు. రాత్రింబవళ్లు కాలువల పనులు జరిగేలా ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలి . ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రి, కార్మికులను పెంచి పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా రోజు వారి లక్ష్యాలను విధించుకుని పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో కరీంనగర్ ఈఎన్ సీ అనిల్, సీఈ శంకర్, ఎస్. ఈ సతీష్ కుమార్, ఈ ఈలు జి.శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, నాగభూషణం, బాలకృష్ణ పాల్గొన్నారు.