వచ్చే నెలలో మడిచే ‘స్మార్ట్ ఫోన్’.

ప్రకాశ్, న్యూఢిల్లీ;

ప్రపంచంలోనే మొట్టమొదటి మడతపెట్టే స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టేందుకు పోటీ మరోసారి ఊపందుకుంది. నవంబర్ 7-8 తేదీల్లో జరిగే శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ టీజర్ పోస్ట్ తో కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ తయారీదారుల్లో కలకలం రేపింది. త్వరలోనే మడతపెట్టే స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ లో శాంసంగ్ పెట్టిన టీజర్ పోస్ట్ చేసింది. దీంతో మడిచే స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చే రోజు మరెంతో దూరం లేదని స్మార్ట్ ఫోన్ ప్రియులు భావిస్తున్నారు. తాము తయారుచేసే మడిచే ఫోన్ జేబులో పట్టే ఒక టాబ్లెట్ అని కొద్ది రోజుల క్రితమే శాంసంగ్ సీఈవో డీజే కో కూడా ధృవీకరించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న మాస్కోన్ వెస్ట్ లో జరగబోయే శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ తో స్మార్ట్ ఫోన్ల రంగంలో కొత్త శకం ప్రారంభం కానుందని శాంసంగ్ మొబైల్ గత వారం పోస్ట్ చేసిన టీజర్ చూసిన వారంతా ఎస్డీసీలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. టీజర్ లో వేర్ నౌ మీట్స్ నెక్స్ట్ (వర్తమానం భవిష్యత్తుని కలిసే చోటు) అనే వాక్యం తర్వాత బాణం గుర్తు ఉంది. ముందు తిన్నగా ఉన్న బాణం గుర్తు తర్వాత ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పనిచేసే తీరుగా వంగుతోంది. అదే ట్వీట్ లో ‘వర్తమానం, భవిష్యత్తుకి మధ్య కూడలి – శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో అత్యున్నత సాంకేతికతతో కలిసి నడిచేందుకు కావాల్సిన విజ్ఞానాన్ని మీరు కలుసుకుంటారు‘ అని ఉంది. ఇప్పటి వరకు ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన డిజైన్, ఇతర వివరాల గురించి ఎలాంటి లీకులు, ఊహాగానాలు బయటికి రాలేదు. అయితే దీనిని శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ అని పిలుస్తారని, దీనిని మడత విప్పాక 7 అంగుళాల డిస్ ప్లేతో రానుందని మాత్రం తెలిసింది. దీని ధర సుమారుగా 1,850 డాలర్లు (సుమారుగా రూ.1,36,500) ఉండవచ్చని భావిస్తున్నారు.