హైదరాబాద్:
పిల్లలను అపహరించే ముఠాగా భావించి వెంటపడ్డారు. దీంతో ఇద్దరు మహిళలు పారిపోగా మరో మహిళ వీరికి చిక్కింది. దీంతో ఆమెపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను రక్షించారు. ఈ క్రమంలో బస్తీవాసులను చెదరగొట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.సామాజిక మాధ్యమాల్లో నరహంతకుల వదంతులు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ను వణికించాయి. చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్ తవక్కల్ ఫ్లవర్ డెకొరేటర్స్ దుకాణం సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు హిజ్రాల వేషధారణలో భిక్షాటన చేస్తున్నారు. నరహంతకుల వదంతుల నేపథ్యంలో జనం దృష్టి వారిపై పడింది. వందల సంఖ్యలో గుమిగూడి రాళ్లతో వారిపై దాడికి తెగబడ్డారు. కంచన్‌బాగ్ ఇన్స్పెక్టర్ శంకర్ బృందం, చాంద్రాయణగుట్ట గస్తీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించగా అల్లరిమూకలు హాకీ స్టిక్‌లు, పిడిగుద్దులతో దాడికి దిగి వాహనాల అద్దాలు ధ్వంసం చేశాయి. సీఐ శంకర్ సహా కార్పొరేటర్ ఫహాద్ అబ్దాత్, మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాత్కూ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంద్రయ్య(60) మరణించగా.. మిగిలిన ముగ్గురు రవి, నర్సింహ, స్వామి చికిత్స పొందుతున్నారు. వీరిలో స్వామి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బండరాయిపల్లికి చెందినవారుగా గుర్తించారు. వీరిని చాంద్రాయణగుట్ట ఠాణాలో దాచారనే అనుమానంతో వందలాది మంది యువకులు ఠాణా ప్రధాన ద్వారం మూసి గేటు ముందు కాపు కాశారు. అల్లరిమూకలు ఇటుక ముక్కలు, రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఉత్తర మండలం డీసీపీ సుమతి పరిస్థితిని సమీక్షించారు. మాదన్నపేట కుర్మగూడ ప్రాంతంలో హిజ్రాల వేషధారణలో భిక్షాటన చేస్తున్న నలుగురిపై శనివారం అర్ధరాత్రి దాటాక స్థానికులు దాడిచేశారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు.రెయిన్‌బజార్ ప్రాంతంలో 12 మంది యాచకులను జనం తరుముతున్నారనే సమాచారంతో పోలీసులు వారిని ఠాణాకు తరలించారు.హఫీజ్‌బాబానగర్ ప్రధాన రహదారిలో ఇద్దరుమహిళలపై దాడి జరగడంతో డీసీపీ సత్యనారాయణ గుంపును చెదరగొట్టారు.
ఆదివారం ఉదయం సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ బస్తీలో లాతూరుకు చెందిన సందీప్(45) ఓ విద్యార్థిని ముద్దు చేయడంతో కొందరు యువకులు అతన్ని కొట్టారు.అతనివద్ద ఇంజక్షన్లు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అతను కిడ్నాపర్ కాదని పోలీసులు గుర్తించారు.
బేగంబజార్ చేపల మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగి ఉన్న రాజు(60) అనే వృద్ధుడిని స్థానికులు చితకబాదారు. అటుగా వెళుతున్న బాలుడిని రాజు కొడుతుండటంతో మార్కెట్లోని మహిళలు అతన్ని బాలుడిని అపహరించేందుకు వచ్చినట్లు భావించి కొట్టారు. నరహంతకులంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్న ముగ్గురు పాతబస్తీ విలేకరులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
అవి మార్ఫింగ్ వీడియోలు: అంజనీకుమార్
అర్ధరాత్రి వరుస ఘటనల నేపథ్యంలో నగర కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం పరిస్థితిని సమీక్షించారు. ‘‘చిన్నపిల్లలను అపహరించే ముఠాలున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. ఇతరదేశాల్లో గతంలో జరిగిన హత్యాఘటనలను మార్ఫింగ్ చేసి పోస్టు చేస్తున్నారు. అసత్యాలను పోస్టు చేయడంతోపాటు షేర్ చేసినా శిక్షార్హులే. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తాం. ఇక ముందు పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్‌తో 24 గంటలూ నిఘా ఉంటుంది. పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా గడిచేందుకు ప్రజలంతా సహకరించాలి’’ అని కమిషనర్ పేర్కొన్నారు.