వన్ సైడ్ లేని ‘వార్’ !!

ఎస్.కె.జకీర్.

‘వార్’ వన్ సైడ్ గా లేదు. టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ ఊహించినట్టు వాతావరణం ‘ఏకపక్షం’ గా ఏమీ లేదు. కారణాలేమైనా కావచ్చు. అసెంబ్లీ రద్దు చేసిన సెప్టెంబర్ 6 నాటి పరిస్థితులలో ‘మార్పు’ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికలప్రచార సభలు, వాటికి హాజరవుతున్న జనం, వారిలో వస్తున్న స్పందన కేసీఆర్ ఊహకు అందనివి.కేసీఆర్ ను గద్దె దింపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కష్టమని ఆ పార్టీ అధిష్టానం భావించింది. కనుకనే ఇటు చంద్రబాబు, అటు రాహుల్ గాంధీ మధ్య ‘అవగాహన’ కుదిరింది. ‘కేసీఆర్ వ్యతిరేక కూటమి’కి స్పష్టమైన రూపం ఒకటీ రెండు రోజుల్లో ఏర్పడవచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ప్రచారం కన్నా వేగంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘ఎన్నికల హామీలు’ ప్రజల్లోకి దూసుకుపోయినవి. అవి ప్రజాదరణ పొందుతున్నట్టు, ప్రజల్లో కాంగ్రెస్ హామీలపై చర్చ ప్రారంభమైనట్టు, కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు జూపుతున్నట్టు కేసీఆర్ కు పక్కా సమాచారం అందింది. దాంతో కాంగ్రెస్ అధికారికంగా ఆ హామీలను ప్రకటించక ముందే ‘పాక్షిక’ ఎన్నికల ప్రణాళిక పేరిట హుటాహుటిన జనంలోకి కాంగ్రెస్ హామీలనే తమ హామీలుగా కేసీఆర్ సంధించారు. పాక్షిక ఎన్నికల ప్రణాళిక అన్నది కేసీఆర్ ప్రయోగం. ఐతే నిరుద్యోగభృతి వంటి విషయాల్లో కేసీఆర్ ‘అవహేళన’ చేసిన వైనం, నిరుద్యోగభృతిని ప్రకటించిన తీరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ హామీల సాధ్యాసాధ్యాలపై చర్చ జరపవలసింది పోయి వాటినే అనుసరించక తప్పని పరిస్థితికి కేసీఆర్ నెట్టివేయబడ్డారంటే ఇక ఈ ఎన్నికలు ‘ఏకపక్షం’గా జరగబోవడం లేదని కేసీఆర్ నిర్ధారించుకున్నట్టే. అధికారపక్షానికి ఉండే వెసులుబాటు వేరు.అసమ్మతిని మొగ్గలో తుంచివేయడానికి అనేక మార్గాలు రెడీ మేడ్ గా ఉంటాయి. మళ్ళీ అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని ఆశ జూపవచ్చు.

 

సంపద పోగుచేసుకునే అవకాశాలపై తగిన హామీలు ఇవ్వవచ్చు. మాట వినని వారిని భయపెట్టవచ్చు. దారికి తీసుకు రావచ్చు. కానీ ప్రతిపక్షాలకు ఆ సౌకర్యం ఉండదు. అధికారంలోకి వస్తామని భరోసా ఇవ్వొచ్చు కానీ అంత త్వరగా ఒక స్థాయిలో ఉన్న నాయకులు వాటిని నమ్మరు. కాంగ్రెస్ లో టికెట్ల కోసం హోరాహోరీ పోరాటం జరుగుతున్నది. పైగా మరో మూడు పార్టీలను కలుపుకొని పోవలసి ఉన్నది. అన్ని పార్టీలను ‘సంతృప్తి’ పరచవలసి ఉన్నది. కలిసికట్టుగా బరిలోకి దిగవలసి ఉన్నది. జట్టుగా కలబడ వలసి ఉన్నది. టిఆర్ఎస్ ను మట్టి కరిపించవలసి ఉన్నది. సొంత పార్టీ అభ్యర్థుల ఖరారులో తేడా వచ్చినా, కూటమి నిర్మాణం సరిగ్గా లేకపోయినా కాంగ్రెస్ కు మొదటికే మోసం వస్తుంది. అభ్యర్థులను ప్రకటించడం దగ్గర నుంచి ప్రచారం వరకు…

అక్టోబర్ 22 నాటికి టిఆర్ఎస్ ముందంజలో ఉన్న మాట నిజం. కానీ అసలు రాష్ట్రంలో తమకు ఎదురేలేదని, ప్రతిపక్షాలు చావుదెబ్బ తిన్నాయని, ప్రతిపక్ష శిబిరాలన్నీ ఖాళీ అయ్యాయని కేసీఆర్ భావించారు. ప్రజల్లోనూ ఆగస్టు చివరన, లేదా సెప్టెంబర్ మొదట్లో ‘వార్ వన్ సైడ్’ వంటి అభిప్రాయం కలగవచ్చును. అలాంటి అభిప్రాయం ఏర్పడేలా కేసీఆర్ అనుకూల మీడియా ‘ప్రభుభక్తి’ ని చాటుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఇప్పటికీ ఆ ప్రయత్నాల్లో కేసీఆర్ అనుకూల మీడియా తలమునకలై ఉన్నది. మీడియా వల్ల ప్రభుత్వాలు మారవు. ప్రజల తీర్పు మారదు. మీడియా ప్రజాభిప్రాయాన్ని ‘వక్రీకరించవచ్చు’. లేదా కేసీఆర్ కు అనుకూల వాతావరణం ఉందని ఊదరగొట్టవచ్చు. ప్రధాన స్రవంతి మీడియా కు సమాంతరంగా సోషల్ మీడియా పనిచేస్తున్నది. 2014ఎన్నికలనాటికి సోషల్ మీడియా ప్రభంజనం పెద్దగా ఉనికిలో లేదు. ఇప్పుడా తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. సోషల్ మీడియా ఎవరి ఆధీనంలోనూ లేనందున దాన్ని ‘కొనుగోలు’ చేయడం కష్టం. కొంతమేరకుభయపెట్టవచ్చునేమో కానీ పూర్తిగా నియంత్రించడమూ సాధ్యం కాదు. తామే ప్రభుత్వాలను మార్చేస్తామని మీడియా ప్రతినిథులు ఎవరైనా భావిస్తూ ఉంటె అది మిథ్య. ఆత్మ వంచన. ప్రజల్ని తక్కువగా అంచనా వేయడమే. మీడియా ‘నిష్పక్ష’ పాత్ర పోషించి నాలుగున్నరేళ్ళు గడచిపోయాయి. ఆ మాటకొస్తే 2014 కు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షకు వ్యతిరేకంగానే ప్రముఖ మీడియా సంస్థలు పనిచేశాయి. కనుక ఆయా సంస్థలు అప్పుడూ’న్యూట్రల్’ గా వ్యవహరించలేదనుకోవాలి. అలాంటి సంస్థలు తర్వాతి కాలంలో కేసీఆర్ ‘మిత్ర సంస్థలు’ గా మారిపోవడమూ చూస్తున్నాం. గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఎవరూ అనడం లేదు. ఏ ప్రభుత్వమైనా కొన్ని పనులు చేయవచ్చు. కొన్నింటిని చేయలేకపోవచ్చు. అన్నింటినీ విశ్లేషించాలి. ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ అభ్యర్థులు కొన్నిచోట్ల ప్రజల నుంచి ప్రతిఘటనను ఎదుర్కుంటున్నారు. పార్టీలో అసమ్మతి, తిరుగుబాట్లను ప్రధాన స్రవంతి మీడియా తొక్కిపెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అది సాధ్యపడకపోగా రోజు, రోజుకి రెట్టింపు అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నవి. ప్రధాన స్రవంతి మీడియాను ‘కిరాయి మీడియా’ అంటూ సోషల్ మీడియాలో పలువురు వ్యక్తులు నిందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట కనీసం లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, టి.కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు ప్రజల్లో ‘ప్రభావం’ చూపుతున్నవి. కేసీఆర్ ‘కుటుంబ పాలన’పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలియవచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ పై తమ వ్యతిరేకతను బహిర్గతం చేయడానికి సామాన్య ప్రజలకు సవాలక్ష అడ్డంకులు ఉంటాయి. అందుకే అదను కోసం వాళ్ళు వేచిచూస్తుంటారు.

దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, జిల్లా కొక’నిమ్స్’ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెలికాఫ్టర్ అంబులెన్సులు, హుస్సేన్ సాగర్ చుట్టు వంద అంతస్తుల ఆకాశ హార్మ్యాలు, కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రెటరీయేట్, కొత్త ఉస్మానియా ఆసుపత్రి, కొత్త రవీంద్రభారతి, నగరాల్లో స్కైవేలు, రింగురోడ్లు, హైదరాబాద్ కి మరో అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి హామీలు కోకొల్లలు. ఎన్నికలవేళ అధికారపక్షం తన హయాంలో ఏమిచేసిందో ప్రజలు పరిశీలిస్తారు. మళ్ళీ అధికారం చేబడితే సదరు పార్టీ చేయగలిగిన పనులపై కొంత నమ్మకం ఏర్పరచుకుంటారు. ప్రతిపక్షం ఏమి చెప్పినా ఆ పార్టీని నమ్మాలా ? వద్దా ? అని ప్రశ్నించుకుంటారు. అధికార, ప్రతిపక్షాల హామీలను ‘తరాజు’ లో తూకం వేసి చూసుకుంటారు. సర్వేలపైన ప్రజలకు నమ్మకం పోయి చాలా కాలమైంది. ప్రతిపక్షాల అభ్యర్థుల ఎంపిక కాకుండా జరిగే సర్వేలలో సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని నివేదికలు రావచ్చు. 100 సీట్లకు పైగా టిఆర్ఎస్ కు వస్తున్నట్టు కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. అదే మాట ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదివారం మరోసారి చెప్పారు.”ప్రభుత్వ పథకాలతో ఒక్కో నియోజకవర్గంలో 60 వేల మందికి లబ్ధి పొందారు. లబ్ధిదారుల జాబితాను అభ్యర్థులకు అందజేశాము. అభ్యర్థుల పనితీరు 5 నుంచి 10 శాతం వరకు మెరుగుకావాలని కేసీఆర్‌ సూచించారు” అని శ్రీహరి తెలిపారు.80 సీట్లకు పైగా తమ పార్టీకి వస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదివరకే చాలా సార్లు చెప్పారు. కనుక ప్రస్తుత సర్వేల ఫలితాలకు పెద్దగా విశ్వసనీయత ఉండకపోవచ్చును. ప్రతిపక్ష శిబిరంతో అసలు పోరాటం ప్రారంభమైన తర్వాత, ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న తర్వాత జరిగే సర్వేల ఫలితాలకు, అది కూడా ఆయా సర్వే సంస్థల ట్రాక్ రికార్డు ఆధారంగా విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆదిలాబాద్ జిల్లాల్లో ‘కారు’ వేగం బాగా త‌గ్గుతున్నట్టు కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

క‌రీంన‌గ‌ర్‌, మహబూబ్ నగర్ , నిజామాబాద్‌, ఖ‌మ్మం, న‌ల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ గాలి కనిపించడం లేదంటూ ప్రచారం జరుగుతున్నది. మెద‌క్‌, ఖ‌మ్మంలలో కూడా ‘ప్రతికూల వాతావరణం’ ఉన్నట్టు సమాచారం అందుతున్నది. తమ పార్టీకి కంచుకోటలుగా భావిస్తున్న జిల్లాల్లోనే ప్రత్యర్థుల నుంచి ‘గట్టి పోటీ’ తప్పని పరిస్థితులు నెలకొనడం ‘ప్రమాదానికి సూచిక’ గా ‘ప్రగతిభవన్’భావిస్తున్న్నట్టుమరో ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారవేయడానికి వీల్లేదు. ఎన్నికల సమయాల్లో చిన్న, చిన్న విషయాలుగా భావించినవే ‘భూతమై’ వెంటాడవచ్చును. ఎన్నికల జయాపజయాలను డిసైడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, దూషణలు ఆంద్రప్రాంతానికి చెందిన ‘సెటిలర్ల’ ను ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వారు టిఆర్ఎస్ కు వ్యతిరేక వైఖరిని తీసుకుంటారా? లేదా ? ఇప్పటికిప్పుడు తేల్చడం సమంజసం కాదు.