వసూల్‌ రాజాలు 391 మంది -పోలీసు శాఖలో దుమారం.

  • ఠాణాల వారీగా సమాచారం
  • వసూళ్లు ఆపకపోతే చర్యలు
  • ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్‌:  
పోలీసు శాఖలో మామూళ్ల బాగోతానికి తెరపడాలంటూ డీజీపీ మహేందర్‌డ్డి జారీ చేసిన ఆదేశాలు పెను దుమారం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా, ఠాణాల వారీగా ఎవరెవరు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూన్నారో చెబుతూ హోదా, సర్వీసు నంబరు, పేర్లతో సహా మొత్తం 391 మందితో తయారైన జాబితా డీజీపీ పేరుతో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు అందింది. ఇప్పుడీ అంశం బహిర్గతం కావడంతో ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పెషల్‌, ఐడీ పార్టీలు రద్దు చేయాలని ఆయన తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో సూచించిన వారిలో కొందరు ఇప్పటికే మామూళ్ల వసూలు మానుకున్నారని, కొందరు మాత్రం ఇంకా అదే పనిలో ఉన్నారని, ఇలాంటి వారిని గుర్తించి తక్షణమే ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు ఎటాచ్‌ చేయాలని డీజీపీ పంపిన ఉత్తర్వులో పేర్కొన్నారు. తద్వారా అన్ని స్థాయుల్లో నెలవారీ వసూళ్లకు తెరపడేలా చూడాలనీ, ఇంకా ఎక్కడైనా ఇలాంటి సంస్కృతి కొనసాగుతున్నట్లు తెలిస్తే సంబంధిత జిల్లా ఎస్పీలు, కమిషనర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీజీపీ   హెచ్చరించారు. ఇదే తుది జాబితా కాదనీ, దీనికి కొనసాగింపు ఉంటుందని పేర్కొనడం గమనార్హం. దీన్నిబట్టి వసూళ్ల బాగోతంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది.పెనవేసుకున్న బంధం: పోలీసుశాఖ-నెలవారీ వసూళ్లు ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. వసూళ్ల మొత్తాన్ని బట్టే ఠాణా విలువనూ లెక్కగడుతుంటారు. అధిక ఆదాయం వచ్చే ఠాణాకు పోస్టింగ్‌ తెచ్చుకోవాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.  దాని పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి నుంచీ లేఖ తెచ్చుకోవాల్సి ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇద్దరు ఎస్సైలు ఆత్మహత్యకు పాల్పడ్డ కుకునూరుపల్లి  ఠాణాకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండేది. సమీపంలోని ఇసుక క్వారీల లారీలు ఈ ఠాణా పరిధి నుంచే వెళ్తుండటంతో ప్రతి లారీ నుంచి క్రమం తప్పకుండా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై రామకృష్ణారెడ్డి అధికారుల వేధింపులే కారణమని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఠాణా స్థాయిలో వసూలయ్యే మామూళ్లను పై అధికారులకూ పంచాలని తెలుస్తోంది. దీనికి సంబంధించి పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్లే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పట్లోనే విమర్శలు వెల్లువెతాయి. ఇక ఠాణాలలో ఎస్సై, సీఐ, సబ్‌డివిజన్‌లో డీఎస్పీ పోస్టింగ్‌ కోసం ప్రజాప్రతినిధులు రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ వసూలు చేస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. ఇలా డబ్బులిచ్చి పోస్టింగ్‌ తెచ్చుకున్న అధికారులు సహజంగానే వసూళ్లను ప్రోత్సహిస్తుంటారు. ఈ మామూళ్ల కోసం రోడ్‌మాస్టర్‌ పేరుతో ఉండే ఉద్యోగి తమ పరిధిలో వ్యాపార సంస్థల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎక్కడెక్కడ ఎంత వసూలు చేయాలో వారికే తెలుస్తుంది. ఒకవేళ ఆ ఉద్యోగి బదిలీ అయినప్పటికీ జీతం అక్కడ తీసుకుంటూ వసూళ్ల పని పాత ఠాణాలోనే చేస్తుంటారు.  జిల్లా స్థాయి వరకూ వసూళ్లలో వాటాలు ఉండటంతో అంతా చూసీచూడనట్లు వ్యవహరించేవారు.  డీజీపీ తాజా ఆదేశాలతో.. పోలీసుశాఖలో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు అధికారికంగా ఒప్పుకున్నట్లయిందనీ, దీని పర్యవసానం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. పోస్టింగ్‌ ఇచ్చేందుకు  రూ.లక్షల్లో లంచం తీసుకుంటున్నప్పుడు, ఇచ్చిన డబ్బు వసూలు చేసుకోవడం మినహా మార్గం ఎక్కడుంటుందనీ, పారదర్శకంగా బదిలీలు చేయనంతకాలం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదోరూపంలో కొనసాగుతూనే ఉంటుందనే అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతోంది.
విస్తుగొలిపే వాస్తవాలు :
డీజీపీ పేరుతో పంపిన ఆదేశాల్లో కొన్ని అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వసూలు చేసే ఉద్యోగి పేరు, సర్వీసు నంబరుతోపాటు ఎవరి కోసం వసూలు చేస్తున్నారో కూడా స్పష్టంగా పేర్కొనడం పోలీసు యంత్రాగాన్ని కుదిపేస్తోంది.  ఈ ఆదేశాల్లోని కొన్ని అంశాలివి.
నారాయణపూర్‌ ఎస్సై మల్లేశ్వరి డ్రైవర్‌ వసూళ్ల ఏజెంటుగా పనిచేస్తున్నారు.
ఓ సీఐ మద్యం దుకాణాల నుంచి వసూళ్లు చేస్తున్నారు.హెడ్‌కానిస్టేబుల్‌ జితేందర్‌రెడ్డి సాయంతో నిందితుల తరఫున  సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. అతన్ని బదిలీ చేసినా వసూళ్లు ఆపలేదు.
బోధన్‌ రూరల్‌ సీఐ తరఫున ఇసుక రవాణాదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు.ఎన్‌బీడబ్ల్యూల అమలు పేరుతో మామూళ్లు వసూలు చేస్తున్నారు.