వార్తల్లోని వ్యక్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.

ప్రకాశ్,న్యూఢిల్లీ;

జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్.. డీవై చంద్రచూడ్. ఇటీవల పలు కీలక అంశాలపై తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్ట్ ధర్మాసన సభ్యుడు. తను న్యాయం అని భావిస్తే మిగతా సభ్యులతో విభేదించడానికి వెనుదీయని వ్యక్తి. రాజ్యం కంటే వ్యక్తిగత హక్కులు ఎక్కువని నమ్మే న్యాయమూర్తిగా మన్ననలు అందుకుంటున్నారు. పౌర హక్కుల నాయకులకు మరో నాలుగు వారాల నిర్బంధం పొడిగిస్తూ ధర్మాసనం ప్రకటిస్తే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒక్కరే దానిని వ్యతిరేకించారు..తను తప్పని భావిస్తే కన్నతండ్రి ఇచ్చిన తీర్పుని కూడా జస్టిస్ డీవై చంద్రచూడ్ లెక్కచేయరు. ఇది ఒకసారి కాదు.. ఇప్పటికి రెండుసార్లు జరిగింది. 1985లో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఉన్నపుడు ఓ వివాహేతర సంబంధం కేసు విచారణ సందర్భంగా సెక్షన్ 497ని కొట్టేయలేమని తీర్పిచ్చారు. 33 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడైన జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రికి భిన్నంగా తీర్పునిచ్చారు. సెక్షన్ 497ని కొట్టేయాలని చెప్పారు. లైంగిక స్వతంత్రతను గౌరవించాలని.. పెళ్లి తర్వాత పురుషుడికి భార్య పూర్తిగా అధీనమయ్యే హక్కునిచ్చే ఈ సెక్షన్ అనవసరమని అన్నారు.అంతకు ముందు వ్యక్తిగత గోప్యతా హక్కు విషయంలోనూ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి తీర్పుతో విభేదించారు. 1976లో అప్పటి చీఫ్ జస్టిస్ ఏఎన్ రే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న జస్టిస్ వైవీ చంద్రచూడ్ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదన్నారు. ఇటీవల జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని చెప్పారు.జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల వెలువరించిన తీర్పుల్లో స్వలింగ సంపర్కులకు సమాన హక్కులనిచ్చే సెక్షన్ 377, మహిళలకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశం వంటివి ప్రముఖమైనవి. శబరిమల తీర్పునిస్తూ మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం ఒక తరహా అస్పృశ్యతేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్త్రీలను నిమ్నజాతి దేవుడి బిడ్డలుగా చూడటం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని చెప్పారు. మహిళలకు ప్రార్థించే హక్కు నిరాకరించరాదన్నారు.మానవహక్కుల పరిరక్షణ, వ్యక్తిగత హక్కులను బలంగా సమర్థించే జస్టిస్ డీవై చంద్రచూడ్ వంటి న్యాయమూర్తులు మరికొందరు దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేందుకు కావాల్సి ఉందని ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.