విధ్వంస కాకతీయ గా మిషన్ కాకతీయ.

వరంగల్ జిల్లాలో ఎం.ఎల్.ఏ ‘చల్లా’ ఆగడాలు
తెలంగాణా ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలలో మిషన్‍ కాకతీయ ఒకటని తెలంగాణా ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నది.వరంగల్‍ పట్టణానికి ఆనుకుని ఉన్న మండలాలలో ఇది నిజం కాదు. క్షేత్ర స్థాయి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో మిషన్‍ కాకతీయ కార్యక్రమంలో చెరువులను అభివృద్ది చేయలేదు అని కాదు. అసలు విషయం ఏమిటంటే, అభివృద్ది తరువాతనే ఈ చెరువుల విధ్వంసం ప్రారంభం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు వచ్చి, అన్ని కార్యక్రమాలను వెనక్కి నెట్టివేసిన తరువాత, మిషన్‍ కాకతీయ చెరువుల గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు యధేఛ్చగా ఈ చెరువుల విధ్వంసానికి పూనుకున్నారు.
లంకా పాపిరెడ్డి,

వరంగల్:
2014 లో నూతన రాష్ట్రం తెలంగాణాలో అధికారానికి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణా ప్రజలకు బంగారు తెలంగాణాను వాగ్దానం చేసింది. గతంలో వలస పాలకులు చేసిన విధ్వంసం నుండి తెలంగాణాను పునర్‍ నిర్మిస్తామని హామీ ఇచ్చింది. వలస పాలకుల పాలనలో తెలంగాణాలోని చెరువులన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఆ చెరువులన్నింటిని పునరుద్దరించి తెలంగాణాను సస్య శామలం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్‍ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం చేపట్టింది. ప్రతి సంవత్సరం వేలకొలది చెరువులను అభివృద్ది చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నది. ఎలక్ట్రాన్‍ మీడియా, ప్రింట్‍ మీడియాలో మిషన్‍ కాకతీయ పనుల గురించి, గొప్పగా అమలు అవుతున్నట్లుగా, అదనంగా భూములు సాగులోకి వస్తున్నట్లుగా చాలా ప్రచారం జరిగింది. జరుగుతున్నది. మిషన్‍ కాకతీయ గురించి మంచి కథనాలు, వార్తలు రాసిన పాత్రికేయులకు సన్మానాలు చేసారు, అవార్డులు ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలలో మిషన్‍ కాకతీయ ఒకటని తెలంగాణా ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్నది.కాని ఇదంతా నిజమేనా ? ఎక్కడైనా నిజమే కావచ్చు కాని వరంగల్‍ రూరల్‍ జిల్లాలో మాత్రం నిజం కాదు. మరీ ముఖ్యంగా వరంగల్‍ పట్టణానికి ఆనుకుని ఉన్న మండలాలలో నిజం కాదు. క్షేత్ర స్థాయి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో మిషన్‍ కాకతీయ కార్యక్రమంలో చెరువులను అభివృద్ది చేయలేదు అని కాదు. అసలు విషయం ఏమిటంటే, అభివృద్ది తరువాతనే ఈ చెరువుల విధ్వంసం ప్రారంభం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు వచ్చి, అన్ని కార్యక్రమాలను వెనక్కి నెట్టివేసిన తరువాత, మిషన్‍ కాకతీయ చెరువుల గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కి చెందిన ప్రజా ప్రతినిధులు యధేఛ్చగా ఈ చెరువుల విధ్వంసానికి పూనుకున్నారు. మిషన్‍ కాకతీయ కార్యక్రమంలో భాగంగా బాగు చేయబడిన చాలా చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంకా చెప్పాలంటే, వలస పాలకుల పరిపాలనలో కూడా తెలంగాణాలో చెరువుల విధ్వంసం ఇంత జరగలేదు. ఇది అతిశయోక్తి కాదు. అధికార పార్టికి చెందిన ప్రజా ప్రతినిధులే, కాంట్రాక్టర్‍ లు కావడం ఈ చెరువులకు శాపంగా మారింది. గ్రేటర్‍ వరంగల్ లో భాగంగా ఉన్న మొగిలిచెర్ల గ్రామం ఒకప్పుడు చెరువులకు పేరుగాంచిన కాకతీయుల నాటి గ్రామం. ఇప్పటికి ఎనిమిది చెరువులు కుంటలు ఉన్నాయి. ఇందులో తూర్పు చెరువు, పడమటి చెరువులు పెద్దవి. ఈ చెరువులనే మొరం గనులుగా మార్చి వేసినారు. పడమటి చెరువులో గనిపాక ప్రభాకర్‍ అనే దళిత రైతుకు ప్రభుత్వం ఇచ్చిన 6 ఎకరాల పట్టాభూమి కూడా ఉంది. ఆ దళిత రైతు ఎవరికి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రేన్‍ మార్కెట్‍ దగ్గరి నుండి పెద్దాపురం వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు కావలసిన మొరం ఈ చెరువుల నుండి తీస్తున్నారు. పళ్ళెంలా ఉండే చెరువు మొత్తం పెద్ద పెద్ద బొందలుగా మారింది. 15-20 ఫీట్ల లోతు వరకు మొరాన్ని తోడినారు. ఆ బొందలలో నీళ్ళు పడితే ఆ నీళ్ళను కూడా టాంకర్‍ ల ద్వారా రోడ్డు మీద చల్లడానికే ఉపయోగిస్తున్నారు. గ్రామస్తులు ఎం.ఆర్.ఓ కు ఫిర్యాదు చేశారు. ఎం.ఆర్.ఓ . కలుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కాంట్రాక్టర్‍ అయిన ఎం.ఎల్.ఏ చల్లా ధర్మారెడ్డి ఆగ్రహించడంతో వెనక్కి తగ్గారు. ఈ రోడ్డు ఈ ఒక్క చెరువునే నాశనం చేయలేదు. అక్కంపేట చెరువులోని మొరం కూడా తీసి దాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణా జాతిపితగా, సిద్దాంత వేత్తగా చెప్పుకునే ఫ్రొఫెసర్‍ జయశంకర్‍ సారుది అక్కంపేట గ్రామమే. పాపం సారు ఉంటే, తెలంగాణా తెచ్చుకున్నది ఇందుకేనా అని గుండె పగిలి చనిపోయేవాడు. సారు అదృష్టవంతుడు ఈ ఘోరాలన్ని చూడకుండానే పోయాడు. ఈ అక్కంపేట గ్రామం నుండి ముందుకు వెల్తే పెద్దాపురం అనే గ్రామం వస్తుంది. ఈ ఊరి చెరువును ఏకంగా ఇటుకబట్టీల కాంట్రాక్టర్‍ కు అప్ప చెప్పాడు స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి. రెవెన్యూ డిపార్ట్‍ మెంట్‍ ను, పోలీసు యంత్రాంగాన్ని, మీడియాను మేనేజ్ చేస్తూ , ప్రశ్నించే అడ్డుకునే గ్రామ ప్రజలను నయనా భయానా అణిచి పెట్టి, స్థానిక శాసనసభ్యుడు ఇష్ఠారాజ్యంగా చెరువులను మొరం గనులుగా మార్చి వేసినాడు. మిషన్ కాకతీయ కాదు, ధ్వంసం కాకతీయ అయ్యింది.
గ్రేటర్‍ వరంగల్‍ కు ఆనుకునే ఉన్న మరో గ్రామం గొర్రెకుంట. ఈ గ్రామంలో ఉన్న తీగల చెరువు నుండి కూడా మొరాన్ని ఇష్టమున్నట్లు తోడి వేశారు. అడ్డుకోబోయిన గ్రామస్తులను భయ పెట్టారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిని సృష్టించారు కాంట్రాక్టర్‍లు. ఈ గొర్రెకుంట నుండి కొంత ముందుకు వెల్తే , పోతరాజు పల్లె అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో, ఊరిచెరువు, కోటచెరువు అని రెండు చెరువులు ఉన్నాయి.( కాకతీయుల మట్టికోట ఈ ఊరు పక్కనుండి వెల్తుంది.) ఈ రెండు చెరువులను కూడా మొరం గనులుగా మార్చి వేసినారు. ఊరిచెరువులో మరీ ఎక్కువగా మొరం తీసి నాశనం చేశారు. గ్రేటర్‍ వరంగల్‍ నగరానికే ఆనుకుని ఉన్న మరో గ్రామం తక్కళ్ళ పాడు (దామెర మండలం). ఈ ఊరి చెరువు నుండి కుడా, అధికార పార్టీ ప్రజాపతినిధుల మద్దత్తుతో ప్రతీ సంవత్సరం మొరం తీస్తూనే ఉన్నారు. ధర్మారం నుండి ఒగ్లాపూర్‍ వరకు పోసిన రోడ్డుకు కూడా ఎం.ఎల్.ఏ . ధర్మారెడ్డి ఈ చెరువు నుండి మొరం తీయించారు. తక్కళపాడు నుండి ముందుకు వెల్తే ఊరుగొండ అనే ఊరు వస్తుంది. ఈ ఊరి చెరువులో కూడ జేసిబి మిషిన్లు రాక్షసుల్లా మొరాన్ని తోడుతూనే ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రాంతంలోని చెరువులన్నింటిని ఎం.ఎల్.ఏ నాయకత్వంలో మొరం గనులుగా మార్చి వేసినారు. ఈ చెరువులన్ని మిషన్‍ కాకతీయలో బాగు చెయ్యబడ్డ చెరువులే కాని ఇప్పుడు ఆ చెరువులన్ని ధ్వంసం అవుతున్నవి.