‘విప్రో’లో ఫ్రెషర్స్ పంట పండింది!!

దేశంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ విప్రో దీపావళికి ముందు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ద్వారా ఎంపిక చేసే ఫ్రెషర్స్ కి బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. విప్రోలో చేరబోయే ఫ్రెషర్స్ జీతం ఏడాదికి రూ.3.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలు చేస్తున్నట్టు తెలిపింది. విప్రో ప్రెసిడెంట్ మరియు హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదుగుబొదుగు లేని క్యాంపస్ రిక్రూట్స్ జీతాల పెంపు ద్వారా హైరింగ్ నాణ్యతను మెరుగు పరిచేందుకు కోడింగ్ టెస్ట్ ప్రమాణాలు పెంచుతున్నట్టు సౌరభ్ గోవిల్ చెప్పారు. హైరింగ్ ప్రాసెస్ పరిధిని పెంచేందుకు నేషనల్ టాలెంట్ టెస్ట్ ని విస్తరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25-30% ఎక్కువగా హైరింగ్ చేస్తున్నట్టు సౌరభ్ గోవిల్ ప్రకటించారు.దేశీయ టెక్ దిగ్గజ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో ఫ్రెషర్స్ కి మంచి జీతానికి కొలువులు దొరకబోతున్నాయి. టీసీఎస్ ఇప్పటికే ఫ్రెషర్స్ కోసం నేషనల్ లెవెల్ టెస్ట్ లాంచ్ చేసింది. విప్రో మూడు అంచెల్లో హైరింగ్ చేస్తుంది. మొదటి దశలో ఐఐటీ వంటి ప్రఖ్యాత స్టార్ కాలేజీ క్యాంపస్ ల నుంచి ఫ్రెషర్స్ ను ఎంపిక చేస్తోంది. వీరికి సగటున ఏడాదికి రూ.12 లక్షల ప్యాకేజీ ఇస్తోంది. దీని తర్వాత టర్బో ప్రోగ్రామ్ అనే మరో దశ ఉంది. ఇందులో రూ.6.5-7లక్షల ప్యాకేజీతో నియామకాలు చేపడుతోంది. మూడో దశ సాంప్రదాయ హైరింగ్ చేస్తోంది. తాము కాలేజీలతో కలిసి నియామక ప్రక్రియ చేపడుతున్నట్టు గోవిల్ తెలియజేశారు. ఇందులో విద్యార్థులకు స్పెషల్ మాడ్యూల్ కింద శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యుఎస్ క్యాంపస్ కోసం ఏడాదికి 65,000 డాలర్లకు హైరింగ్ చేస్తున్నట్టు సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.