విమర్శలకు వెరవని కళైంజ్ఞర్‌. మీడియా ప్రశ్నలకు జంకని కరుణ.

ఎస్.కే. జకీర్.
ఆరు దశాబ్దాలకుపైగా తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడిగా, కళైంజ్ఞర్‌గా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీఎంకే అధినేత కరుణానిధిది దేనికీ భయపడని తత్వం. ఇబ్బంది పెట్టే ప్రశ్నలైనా, విమర్శలైనా దేనికీ వెనుకంజ వేసేవారు కాదు. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేవారు. ఇవి కరుణ గురించి ఆయనతో పరిచయం ఉన్న పలువురు జర్నలిస్టుల అభిప్రాయాలు.
1995లో కరుణానిధి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పుడు మద్రాస్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, జర్నలిస్ట్, రచయిత అయిన ఈ.జె. సుందర్ ఆయనను తన ‘సుట్టి ‘పత్రికలో నిశితంగా విమర్శించారు. దీనికి కరుణ బహిరంగసభలలో ధీటుగా సమాధానం ఇచ్చారు. కరుణానిధితో తన ఇంటర్వ్యూని గుర్తు చేసుకుంటూ ‘ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ప్రవర్తించలేదు. ఆయనను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేసినా కోపం తెచ్చుకోలేదు. అన్నిటికి ఓపికగా సమాధానం ఇచ్చారు. అదే ఆయన బలం. అవతల వ్యక్తి అవగాహన స్థాయికి తగ్గట్టుగా తనను తాను మార్చుకొనేవారు. ఇదే ఆయనను డీఎంకే శ్రేణులకి దగ్గర చేసింది. దాని సాయంతోనే డీఎంకేలో తన కంటే సీనియర్లను దాటి వెళ్లగలిగార’ని సుందర్ విశ్లేషించారు. ‘తనను వ్యతిరేకించినా వ్యక్తుల ప్రతిభను గుర్తించడంలో కరుణానిధి ముందుండేవారు. ఆయనను విమర్శించినా 1996లో విడుదలైన నా పుస్తకానికి ముందుమాట రాసిచ్చారు. ఎవరైనా మంచి అధికారిని సిఫార్సు చేస్తే వెంటనే వారిని వెతికితెచ్చి సముచిత స్థానంలో నియమించేవార’ని సుందర్ గుర్తు చేసుకున్నారు.తనకు ఇష్టం లేని వార్తలపై కరుణానిధి చాలా అరుదుగా ఎడిటర్లకి ఫిర్యాదు చేసేవారని ఎంతో కాలం డీఎంకే కార్యకలాపాలు చూసిన ది హిందూ పత్రిక రిపోర్టర్ ఆర్.కె. రాధాకృష్ణన్ తెలిపారు. కోపం వస్తే ఆ రిపోర్టర్ తోనే అమీతుమీ తేల్చుకొనేవారు లేదా తమ పార్టీ పత్రిక ‘మురసోలి’లో విమర్శించేవారు. ‘ఓ సారి ఫోన్లో కేకలు వేసి గోపాలపురంలోని తన ఇంటికి రమ్మన్నారు. కాఫీ తాగుతూ నేను రాసిన వార్తలో తనకేది తప్పుగా తోచిందో చెప్పారు. నేను నా వాదన వినిపించాను. ఆయన ఓపికగా విన్నార’ని రాధాకృష్ణన్ నెమరేసుకున్నారు. కరుణానిధి విద్యావంతులకు ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అన్నా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా, తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గా ఎం.ఆనందకృష్ణన్ ను నియమించారు. ఎప్పుడు సీఎం కార్యాలయానికి వెళ్లినా కుర్చీ నుంచి లేచి నిలబడి ఆహ్వానించేవారని ఆనందకృష్ణన్ తెలిపారు.