విలేకరి: యూజ్ అండ్ త్రో

రాత మారని జర్నలిస్టులు.ఆచరణలో పొంతన కుదరని కెసిఆర్ ప్రసంగాలు.


విశ్వనాథ్, కరీంనగర్;
విప్లవమంటే విందు భొజనం కాదు… బొమ్మలకు రంగులు వేయడం అంతకన్నా కాదు… అన్నారు తెలంగాణ జర్నలిస్టులు మాత్రం ప్రతి చిన్న అంశాన్ని విప్లవంగా చూపించారు. తెల్లగల్లు తాగితే అది నిరసన… గుడాలు బుక్కితే అది ఆందోళన… ఎడ్ల బండి ఎక్కితే అది పోరాటం… రోడ్డెక్కితే అది ప్రళయం… రాస్తారోకో చేపడితే మహోద్యమం… ఇదీ తెంగాణ ఉద్యమ కాలమంతా వెతికినా కనిపించే దృశ్యాలు. స్వరాష్ట్రం కోసం తమ వృత్తిని పణంగా పెట్టి ఆంధ్ర పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు ధర్మయుద్ధం పక్షాన నిలబడి తెంగాణ రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంపాటు భారతంలో అశ్వత్థామ హత: కుంజర: అంటూ ధర్మరాజు వాడిన నీతి సూత్రాన్ని తెలంగాణ జర్నలిస్టు పాటించారు. రాష్ట్రం కోసం… రాష్ట్ర ప్రజల కోసం అబద్దాలను సైతం సత్యవాక్కుగా రాశామంటున్న వారు లేకపోలేదు. తెలంగాణ ఆకాంక్ష బలమైన తిరుగుబాటుగా, మహోద్యమంగా వార్తలు రాసిన జర్నలిస్టులకు నాలుగేళ్ల టిఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏమీ ఇవ్వలేదన్న ఆక్రోశం అందరిలో వ్యక్తమవుతోంది. దీంతో జర్నలిస్టులంతా తొలిసారిగా హైదరాబాద్‌లో గర్జన సదస్సును తలపెట్టి తమ నిరసన గళాన్ని విప్పారు. తెంగాణ రాష్ట్రం సాధిస్తే ఆంధ్రపత్రికలు తోక ముడుస్తాయని ఇక వారి పప్పులుడకవని కేసిఆర్‌ ఎన్నో సార్లు చెప్పిన మాటలను జర్నలిస్టులు గుర్తు చేసుకుంటున్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక, అంతకు ముందు, ఆ తర్వాత వచ్చిన స్థానిక పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే యాడ్స్‌ లభించడం లేదని కుమిలిపోతున్న చిన్న పత్రికల సంపాదకులు, అక్రిడేషన్లు రాలేదని బాధపడుతున్న చిన్న పత్రికల జర్నిలిస్టులు గర్జనలో గొంతు కలిపారు. పైగా ఎంప్యానల్‌ నిబంధనల పేరిట చిన్న పత్రికలన్నీ అణచివేతకు గురయ్యాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రెస్‌భవన్‌ నిర్మిస్తామని, జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూంలు కట్టిస్తామని హామి ఇచ్చిన కేసిఆర్‌ మాటలను నమ్ముకున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం రాలేదు. ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్‌కు, రాష్ట్రసాధనకు వెన్నుదన్నుగా నిలిచిన విలేకరులంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారు. తమ పాత్రను ఇకనైనా నిజాయితీగా నిరూపించుకోవాలని రానున్న ఎన్నికలే తమ వృత్తి గౌరవాన్ని పెంపొందించుకునేందుకు వేదికవుతాయా అని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది.రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరంగా అనేక జే ఏసీలు, రాజకీయ పారీలతో కలిసి పనిచేశరు.ఆంధ్ర యాజమాన్యాల వద్ద పని చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారు.తెలంగాణ పునర్‌ నిర్మాణంలో  జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైంది. తెలంగాణ ఉద్యమం జర్నలిస్టులను సైతం ఏకం చేసింది.భిన్న పార్టీలను, ఉద్యమ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో తెలంగాణ జర్నలిస్టులు గణనీయమైన పాత్ర పోషించారు. తెలంగాణ జర్నలిస్టులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని ప్రజలకు అందించడం ద్వారా వారిలో చైతన్యం నింపారు. 2010 ఏప్రిల్ 28న తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో రాష్ట్ర సాధన కోసం ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2010 అక్టోబర్ 4న టీజేఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మీడియా మార్చ్ నిర్వహించారు. అంతేగాకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 2010 డిసెంబర్ 5న ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ పాత్రికేయుల మహాసభ నిర్వహించారు. వందలాది మంది జర్నలిస్టులు అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అజిత్‌సింగ్ హాజరయ్యారు. 2011 మే 19న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వందలాది మంది పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. 2012, అక్టోబర్ 16న తెలంగాణ పది జిల్లాల్లో జర్నలిస్టులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో జర్నలిస్టుల పాత్ర మరువరానిది.తెలంగాణవాదులపై, విద్యార్థులపై జరుగుతున్న దాడులను, అణచివేతను ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి నిర్భయంగా అందించడం ద్వారా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమం నలుమూలలకు విస్తరించడానికి దోహదం చేశారు.ఎందరో జర్నలిస్టులు గాయాలపాలై, లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో ముఖ్య పాత్ర  పోషించారు.