వీధికో బెల్టుషాపు. పాలమూరులో అక్రమ మద్యం.

మహబూబ్ నగర్:
పుట్టగొడుగుల్లా వీధికో బెల్టు దుకాణం వెలుస్తున్నా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లా కేంద్రంలో బెల్ట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. తీమ్మసానిపల్లి, దొడ్డలోనిపల్లి, ఎనుగొండ అప్పన్నపల్లి, ఎదిర, కోడూరు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రూ.30 నుంచి 40 ఎక్కువ తీసుకుంటూ బెల్టుషాపులతో కొందరు కోటీశ్వరులవుతున్నారు.
గ్రామగ్రామాన మద్యం అక్రమ దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో వసతులు లేకున్నా వీధికో బెల్టు దుకాణం వెలుస్తోంది. రోజంతా కూలీనాలి చేసుకుంటున్న శ్రమజీవులు సాయంత్రం కాగానే సంపాదించిన సొత్తంతా బెల్టు దుకాణాల్లో పోస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యం విక్రయించకుండా అధిక ధరలకు మద్యం విక్రయాలకు పాల్పడుతూ పేదలు, మద్య తరగతి వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు. వీరిని అటు టెండర్లు, దక్కించుకున్న మద్యం వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పెంచి పోషిస్తుండడంతో గ్రామాల్లో మద్యం అక్రమ దుకాణాలు పెచ్చు మీరుతాన్నాయి. దాడులకు పాల్పడకుండా ఉండేందుకు పోలీసులకు సైతం నెలనెలా ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మహబూబ్‌నగర్ విలీన గ్రామీణ ప్రాంతాలతో పాటు మారు మూల ప్రాంతాల్లో సైతం మద్యం ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న టెండర్ దక్కించుకున్న మద్యం దుకాణాలు వాటి అమ్మకాలను విలీన గ్రామాలకు విస్తరించేందుకు బెల్టు దుకాణాలను పెంచిపోషిస్తున్నాయి. మద్యం దుకాణాలు యాజమాన్యాలు సిండికేట్‌గా మారి బెల్టు దుకాణాలను పంచేసుకున్నారు. వీరు విధించుకున్న నిబంధనల ప్రకారం ఓ వైపు వచ్చిన దుకాణదారులతో మరో దుకాణానికి వెళ్లకూడదు. ఇలా బెల్టు దుకాణాలు పంచుకుని వారికి పెద్ద ఎత్తున మద్యం సరుకును సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో రాత్రి 11 గంట ల వరకు బెల్టు దుకాణాలు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నాయి.అదుపు లేకుండా జనం వద్ద నుంచి ఎమ్మార్పీ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. మందు బాబు లు బెల్టు దుకాణాలకు వస్తే వారి ముక్కుపిండి ప్రభుత్వం విధించిన ధరల కంటే సుమారు రూ.20 నుంచి 40 అధికంగా వసూలు చేస్తున్నారు.మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఎవరి వాటలను వారికి ముట్టజెప్పుతున్నారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు సజావుగా జరగాలంటే, వారిపై దాడులు నిర్వహించకుండా ఉండేందుకు దాడు లు చేసే ఆయా శాఖలకు డబ్బులు ఎర చూపుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు నెలనెలా రూ.20 వేల నుంచి 25 వేల వరకు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మద్యం దుకాణాలు నిర్వహణ చూసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు తుంగలో తొక్కి వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా మద్యం సరుకులను సరఫరా చేస్తూ ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి బెల్టు దుకాణాలను మూసి వేయించాలని ప్రజలు కోరుతున్నారు