వెనిజులా అధ్యక్షునిపై హత్యాయత్నం.

కారకాస్‌:
వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురోపై హత్యయత్నం జరిగింది. శనివారం సాయంత్రం సైనిక కవాతుల పాల్గొన్న ఆయనపై డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు ఆయనకు సమీపంలో పేలడంతో ఈ ఘటన సంభవించింది. అయితే, ఇందుకు కారణం లెఫ్ట్‌ పార్టీలేనని ఆ దేశ మంత్రి జార్జ్‌ రోడ్రిగోజ్‌ ఆరోపించగా, దేశాధినేత మాత్రం ఇది పొరుగు దేశమైన కొలంబియా పనేనని ఆరోపిస్తున్నారు. మాదురో దేశ ఎకానమీ మీద ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు సంభవించింది. ఈ ఘటనంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనానంతరం అక్కడికి వచ్చిన సైనికులు, ప్రజలు పరుగులు తీయడం స్థానిక ఛానెళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించింది. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి మీడియా తెలిపింది.కట్టుదిట్టమైన భద్రతల నడుమ మాదురోను భద్రతా బలగాలు సురక్షితంగా వేదిక బయటకు తీసుకువచ్చారు. ఈ పేలుడు ఘటనలో సుమారు 9మంది గాయపడి ఉండవచ్చిన అంచనా వేస్తున్నారు. ఈ ఘటన అంతటికి సూత్రధారులు పొరుగు దేశం కొలంబియా, అమెరికాలోని కొందరు ఆర్థిక వేత్తలే కారణమని మాదురో ఆరోపించారు. అయితే కొందరు అధికారులు మాత్రం వెనెజులాలోని ప్రతిపక్ష పార్టీలు ఈ దారుణానికి తెగించాయని అంటున్నారు. మరోవైపు మాదురో ఆరోపణలను కొలంబియా తిప్పి కొట్టింది. ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ఖండించింది. ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు.