వేగంగా రామ మందిర నిర్మాణం!!

ప్రకాశ్, న్యూఢిల్లీ:
అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన వారం తిరగకుండానే నగరంలో పనులు ఊపందుకున్నాయి. స్థానిక పూజారులు, భక్తుల రామభజనలతో కరసేవక పురం మార్మోగుతోంది. ప్రతిపాదిత రామ మందిర నమూనాను చూసేందుకు తీర్థయాత్రికులు, ఔత్సాహిక పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. అక్టోబర్ 29న ప్రారంభమయ్యే రామజన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం కేసు విచారణ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బలంగా నమ్ముతున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) మందిర నిర్మాణానికి ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
మూడు అంతస్థుల మందిర నిర్మాణం కోసం రాళ్లను తెచ్చేందుకు వీహెచ్ పీ భారీగా ట్రక్కులను మాట్లాడి పెట్టింది. 70కి పైగా ట్రక్కుల్లో రాళ్లు త్వరలోనే రానున్నట్టు స్థానిక వీహెచ్ పీ నేతలు చెబుతున్నారు. ఇది ఏడాది కిందట రామజన్మభూమి మందిర నిర్మాణ కార్యశాలకు తెప్పించిన పరిమాణానికి నాలుగు రెట్లు ఎక్కువ. రాతి స్థంభాలు, ఇతర నిర్మాణాలను చెక్కేందుకు అదనంగా శిల్పులని రప్పిస్తోంది. వీహెచ్ పీ, రామజన్మభూమి న్యాస్ లోని కీలక వ్యక్తులు పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే మరిన్ని రాళ్లు, కళాకారులను తెప్పిస్తున్నట్టు వీహెచ్ పీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చంపత్ రాయ్ తెలిపారు.మంగళవారం అయోధ్యలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. రామజన్మభూమికి వెళ్లే మార్గంలో ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు డేగ కన్ను పెట్టాయి.