వేలం వేసిన ఆ పింక్ డైమండ్ టీటీడీదేనా?

కొండా శ్రీనివాస్:
తిరుపతి:
ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వివాదాలు, అవినీతి ఆరోపణలు, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల తొలగించబడిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చేసిన ఆరోపణలు చర్చానీయాంశాలయ్యాయి. తిరుమల స్వామి వారి విగ్రహానికి అలంకరించే ప్లాటినం నెక్లెస్ లోని పింక్ డైమండ్ చాలా రోజులుగా కనిపించడం లేదని..అయితే ఇటీవల జెనీవాలో 5 వందల కోట్లకు వేలం వేసిన డైమండ్ స్వామి వారి డైమండేమోనని రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ పింక్ డైమండ్ కనిపించకుండా పోవడంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని రమణ దీక్షితులు కోరుతున్నారు. అంతే కాదు..1996 నుంచి స్వామి వారి విలువైన నగలు ఎన్నో మాయమైనట్టు చెప్పారు. స్వామి వారి నగలు మాయమైన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు రాకుండా చూస్తున్నారని రమణదీక్షితులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పోటు (లడ్డూలు తయారు చేసే కిచెన్ ) కు మరమ్మతులు చేశారని..చాలా రోజులు పోటును మూసివేశారని అన్నారు. పోటు కింద గుప్త నిధి ఉన్నట్టు విశ్వసిస్తుంటారని అన్నారు.
రమణదీక్షితులు ఆరోపణలను టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఖండించారు. దేవాలయ అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలుగా నిర్ణయించడం వల్ల రమణదీక్షితులును తొలగించాల్సి వచ్చిందని..ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంతోనే రమణదీక్షితులు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వామి వారి ప్లాటినం నక్లెస్ లో వున్నది పింక్ డైమండ్ కాదని..రూబీ అని..భక్తులు విగ్రహంపై నాణేలు విసరడం వల్ల ఆ రూబీ ఎక్కడో పడిపోయిందని వివరణ ఇచ్చారు. నిబంధనలు అంగీకరిస్తే స్వామి వారి నగలను చూపించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు.
ఇదిలా వుండగా రమణదీక్షితులు తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. రమణ దీక్షితులు వెనకాల బీజేపీ నేతలున్నారని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై వచ్చిన తర్వాతనే రమణ దీక్షితులు టీటీడీ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. రమణదీక్షితులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో కలిసి వున్న ఫోటోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.