వైకాపా ఎంపీల రాజీనామా ఒక డ్రామా. బీజేపీతో వైకాపా మ్యాచ్ ఫిక్సింగ్. టీడీపీ లో కాంగ్రెస్ వ్యతిరేక డి.ఎన్. ఏ.

-ఎం.పి. కేశినేని నాని.
బిజెపి తో, లోక్ సభ స్పీకర్ తో వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు టిడిపి ఎం.పి.కేశినేని నాని బుధవారం ఆరోపించారు. అందుకే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తే ఇప్పటి వరకు ఆమోదం పొందలేదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951)లోని రూల్ 151(ఏ) ప్రకారం ఏడాది లోపు సార్వత్రిక ఎన్నికలుంటే ఖాళీలను భర్తీ చేసే అవకాశం లేదని ఆయన తెలిపారు.ఉప-ఎన్నికలు జరగవని తెలిసే ఆలస్యంగా రాజీనామాలు చేశారని నాని విమర్శించారు.
2016 నుంచి రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు చేసిన వైకాపా నేతలు ఆలస్యంగా 2018లో చేశారని అన్నారు.మే 18న 16వ లోక్‌సభ కొలువుతీరిందని, జూన్ 4న తొలిసారి సమావేశమైందని ,ఈలోపు ఆమోదం పొందినా ఉప-ఎన్నికలకు అవకాశం ఉండేదన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా నాలుగేళ్లు పూర్తైన తర్వాత రాజీనామాల ఆమోదం డ్రామా ఆడుతున్నారని నాని ఆరోపించారు.
కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను తక్షణమే ఆమోదించిన స్పీకర్, వైకాపా ఎంపీల రాజీనామాలు మాత్రమే ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు.ఇదంతా లాలూచీలో భాగం కాదంటే ఎవరైనా నమ్ముతారా? అని అన్నారు.
ఉప ఎన్నికలు వస్తే నంధ్యాల, కాకినాడ ఫలితాలు పునరావృతమవుతాయని వైకాపా ఎంపీలు భయపడుతున్నారని ఎం.పి.అభిప్రాయపడ్డారు. రాని ఎన్నికలను చూపిస్తూ భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీతో లాలూచీ పడ్డ వైకాపా ప్రతిపక్షంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం అని అన్నారు.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దోచుకున్న సొమ్ముతో పెట్టిన అవినీతి పార్టీ వైకాపా అని అన్నారు.ఆ దోచుకున్న సొమ్ము దాచుకోడానికే పార్టీని పెట్టారని ఆరోపించారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చెప్పారు.ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజల్ని వంచిస్తూ చరిత్రలో వంచన పార్టీగా మిగిలిపోతున్నారని అన్నారు. ఉప-ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ రావు. వస్తే ఎన్నికల్లో పోటీ చేసి మా సత్తా చూపిస్తామని టిడిపి ఎం.పి.అన్నారు. ఉప-ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కొత్తేం కాదు. ఎన్నికలు వచ్చిన రోజు ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు.రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రబాబు చక్రం తిప్పుతారని నాని అన్నారు.అన్న ఎన్టీయార్ హయాంలో ఒక ఫ్రంట్, ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే-1లో చంద్రబాబు నాయుడు కీలక పాత్రలు పోషించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై జరిగిందన్నారు. తెలుగుదేశంలో కాంగ్రెస్ వ్యతిరేక డీఎన్ఏనే ఉంటుందన్నారు.రాష్ట్రాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ మీద, నమ్మించి మోసగించిన బీజేపీ మీద ప్రజలు కోపంతో ఉన్నారని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తుందన్నారు.