వైద్యరంగంలో గుణాత్మక మార్పు. -కేటీఆర్.

హైద‌రాబాద్.
తెలంగాణ స‌ర్కార్ మాన‌వీయ కోణంలో వైద్యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ద‌ని, అందువ‌ల్లే అన్ని స‌దుపాయాల‌తో పాటు ఐపీ, ఓపీ పెరిగి నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అని ప్ర‌జ‌లు అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్నారు. వైద్యారోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల కార‌ణంగా గుణాత్మ‌క మార్పు వ‌చ్చింద‌న్నారు. మ‌రోవైపు అన్ని జిల్లా ద‌వాఖానాల్లోనూ స్పెషాలిటీ వైద్యాన్ని విస్త‌రిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఇంటింటికీ కంటి వైద్యం, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసి హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేస్తామ‌ని చెప్పారు. సీఎం కెసిఆర్ దిశానిర్దేశం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మైంద‌ని చెప్పారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. ఈ ఇద్ద‌రు మంత్రులు హైదరాబాద్ లోని నారాయణగూడ లో గల ఐపీఎం ఆవరణలో జ్యోతిని వెలిగించి *తెలంగాణ డియాగ్నోస్టిక్స్  ని ప్రారంభించారు.
అనంత‌రం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఒక‌ప్పుడు నేను రాను బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అనే ప‌రిస్థితి ఉండేది. అప్ప‌ట‌వి ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతూ అప్ప‌ట క‌వులు ఆ విధంగా పాటలు రాశారు. ప్ర‌జ‌లూ ఆద‌రించారు. కానీ నేటి ప‌రిస్థితులు వేరు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్యం రంగం అద్భుత ప్ర‌గ‌తిని సాధించింద‌న్నారు. ప్ర‌భుత్వ విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు, వైద్య రంగంలో గుణాత్మ‌క మార్పులు తెచ్చాయ‌న్నారు. మంత్రి ల‌క్ష్మారెడ్డి కృషి ఫ‌లితంగా స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. అందుకే సర్కార్ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. 20 ఐసియూలు, 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామ‌న్నారు. కేసీఆర్ కిట్ లాంటి హిట్ ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.  హైదరాబాద్ లో 17 బస్తి దవాఖాన లు ప్రారంభించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ సంఖ్య‌ను 45కి పెంచుతామ‌ని,  న‌గ‌రంలో మొత్తం 1000 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ సంక‌ల్ప‌మ‌ని కెటిఆర్ చెప్పారు. అలాగే ప్ర‌స్తుత డయాగ్నోస్టిక్ సేవ‌ల‌ను బ‌స్తీ ద‌వాఖానాల‌కు కూడా అన్వ‌యించాల‌ని కెటిఆర్ మంత్రి ల‌క్ష్మారెడ్డికి సూచించారు.
సామాన్యులకు, పేదలకు రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు భారం కాకుండా వైద్య పరీక్షలు ఉచితంగా ప్ర‌భుత్వ‌మే అందించే చ‌ర్య‌లు అద్భుత‌మైన ఆలోచ‌న అన్నారు. హైద‌రాబాద్‌లోని ఐపిఎంలోని డయాగ్నోస్టిక్స్ కేంద్రంగా 8 ఏరియా హాస్పిట‌ల్స్ నుంచేగా 120 సామాజిక‌, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల నుండి సేకరించిన ర‌క్త న‌మూనాల ప‌రీక్ష‌లు ఇక్క‌డ జ‌రుగుతుండ‌టం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఒక గంట‌లో 20 నుంచి వెయ్యి వ‌ర‌కు ప‌రీక్ష‌ల రిపోర్టులు తేగ‌లిగే స్థాయి అధునాత‌న ప‌రిక‌రాలు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిస్తున్న టాటా ట్ర‌స్ట్‌ని మంత్రి అభినందించారు. ఈ కార్య‌క్రమంలో మంత్రుల‌తోపాటు కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, డిహెచ్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, టివివిపి క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్‌, ఐపిఎం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శంక‌ర్‌, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్‌, ఎంఎన్‌జె డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జ‌య‌ల‌త‌, అరుణ్‌, గోపీకాంత్‌, టాటా ట్ర‌స్ట్ బాధ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.